Nafithromycin | న్యూఢిల్లీ, డిసెంబర్ 2 : ఔషధాలకు లొంగని వ్యాధికారకాల పని పట్టించే యాంటీబయాటిక్ ‘నఫిత్రోమైసిన్’ను భారత్ తయారుచేసింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగమైన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బీఐఆర్ఏసీ) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీబయాటిక్ ఇది. ఔషధాలకు లొంగని కమ్యూనిటీ – అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా(సీఏబీపీ) చికిత్స కోసం పెద్దలకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు.
ఇప్పుడు నిమోనియా చికిత్సకు ఎక్కువగా అజిత్రోమైసిన్ వాడుతున్నారు. అయితే, వ్యాధికారకాలు ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటుండటంతో చాలామంది రోగుల్లో అజిత్రోమైసిన్ సరిగ్గా పని చేయడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నిమోనియా చికిత్సకు నఫిత్రోమైసిన్ సమర్థంగా పని చేస్తున్నది. రూ.500 కోట్ల పెట్టుబడితో 14 ఏండ్ల పరిశోధన ద్వారా ఈ ఔషధాన్ని తయారుచేశారు. త్వరలో ‘మిక్నాఫ్’ పేరుతో ముంబైకు చెందిన ఫార్మా కంపెనీ వొల్కార్డ్ ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నది.