హైదరాబాద్: పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి ఒకరు మృతిచెందారు. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరికి చెందిన పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతులు హైదరాబాద్ ఉప్పల్‌లోని ధర్మపురీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు పాల్వాయి ఆర్యన్ రెడ్డి (Aryan Reddy) ఉన్నత చదువుల కోసం గతేడాది డిసెంబర్లో అమెరికా వెళ్లారు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్ చదువుతున్నారు.
ఈక్రమంలో ఈ నెల 13న తన పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అయితే ఆర్యన్ ఉన్న గది నుంచి తుపాకీ శబ్దం రావడంతో.. స్నేహితులు వెళ్లి చూడగా అతడు అప్పటికే విగతజీవిగా పడి ఉన్నారు. బుల్లెట్ ఛాతీ లోపలికి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, తుపాకీని శుభ్రం చేసే క్రమంలో మిస్‌ఫైర్ అయి మరణించినట్లు అధికారులు తెలిపారు. అతడు ఈ ఏడాది ఆగస్టులో హంటింగ్ గన్‌కు లైసెన్స్ తీసుకున్నారని వెళ్లడించారు.