హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : బుద్ధుడి కాలం నుంచే భారత్, జపాన్ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని జపాన్లో భారత రాయబారి సీబీ జార్జ్ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్యాదవ్, షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ మురళీధర్ మిరియాల సోమవారం సీబీ జార్జ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ విద్యాసంస్థలతో ఓయూకు ఉన్న ఎంవోయూపై చర్చించారు. తర్వాత, షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టెకో సుజుమీతో వీసీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు కుదుర్చుకొన్న ఒప్పందంపై చర్చించారు. అనంతరం షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉస్మానియా విద్యార్థుల మధ్య మేధోపరమైన నైపుణ్యాలను అంచనా వేయడానికి గ్లోబల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. టీం వర్క్ ద్వారా సమస్యను ఎలా పరిష్కరించవచ్చో సుజుమీ వివరించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సూపర్ కండక్టింగ్ మెటీరియల్ వినియోగంపై ప్రొఫెసర్ మిరియాల మురళీధర్ ప్రదర్శన ఇచ్చారు.