న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: నైరుతి రుతుపవనాల తిరోగమనంప్రారంభమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో 15 శాతం తక్కువ వర్షపాతంనమోదు కాగా, ఎల్ నినో కూడా ఏర్పడటంతో తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమై 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత 17 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో దేశంలోని పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాగునీటికే కాక, తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. 17 ఏండ్లలో అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలోనే శనివారం నైరుతి రుతుపవనాలు పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి తిరోగమించడం ప్రారంభమైంది. రాబోయే కొద్ది వారాల్లో నాలుగు నెలల పాటు సాగే వర్షాకాలం ముగింపునకు నాంది పలకబోతున్నది. రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్, గుజరాత్‌లలోని కొన్ని ప్రాంతాల నుంచి తిరోగమనానికి రానున్న 3,4 రోజులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బలమైన ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ సీజన్ మొత్తంలో దేశవ్యాప్తంగా 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణాది రాష్ర్టాలను చూస్తే అత్యధికంగా ఏపీలో 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (31 శాతం), కేరళ (28 శాతం), తమిళనాడు (22 శాతం), తెలంగాణ (22 శాతం) ఉన్నాయి. ఇక ఇతర రాష్ర్టాల్లో పంజాబ్‌లో అత్యధికంగా 39 శాతం లోటు వర్షపాతం నమోదైంది. బీహార్ (36 శాతం), హర్యానా (22 శాతం), రాజస్థాన్ (21 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సగటుకన్నా 26 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వీటిలో మేఘాలయ (59 శాతం), మణిపూర్ (43 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (41 శాతం), అస్సాం (26 శాతం) అత్యంత ప్రభావిత రాష్ర్టాలుగా ఉన్నాయి. కాగా, దేశంలో 2009లో 18 శాతం లోటుతో అధ్వాన వర్షపాతం నమోదు కాగా, దాని తర్వాతి స్థానంలో ఈ ఏడాది వర్షపాతం నిలిచింది. కాగా, వచ్చే వారం బంగాళాఖాతంలో ఒక తీవ్ర అల్పపీడనం ఏర్పడనుందని, ఏపీ, ఒడిశాలలో వర్షాలు పడతాయని, అయితే నమోదైన లోటు వర్షపాతంపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు.