న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం పలువురు పౌరులతో పాటు ప్రముఖుల పేర్లను ఎడాపెడా తొలగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చూడటం ప్రధాన లక్ష్యంగా ‘సర్’ నిర్వహించాల్సి ఉండగా, అది పూర్తిగా దారితప్పుతున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్ ఎస్ఎస్ సంధు, కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ‘సర్’ నోటీసులు జారీ అయ్యాయి.
వీరు కాక, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అతని కుటుంబ సభ్యులు, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, అతని కుటుంబం, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అతని భార్య, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్, కుటుంబ సభ్యులు, ఎంపీ కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరు కాక ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, అతని కుటుంబ సభ్యులు, అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీకి కూడా ఈసీ ఇప్పటికే నోటీసులు అందజేసింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ప్రకాశ్ రాజ్, ఎంపీ రాఘవ్ చద్దా, న్యూఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్, బీజేపీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ సచ్‌దేవా తదితరులకు నోటీసులు జారీ అవ్వడం వివాదాస్పదమైంది.
పేర్లలో తప్పులు, అక్షర దోషాలు, వారి పేర్లు గత ‘సర్’ రికార్డులతో మ్యాపింగ్ కాకపోతే నోటీసులు పంపడం సహజమేనని అధికారులు పేర్కొంటున్నారు. వారి పేర్లు, కుటుంబ వివరాలలో వ్యత్యాసాలు ఉండటం వల్ల గానీ ప్రస్తుతం పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన పలువురు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
దీనిపై ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివరణ ఇస్తూ నోటీసులు వచ్చాయంటే ఎన్నికల జాబితా నుంచి అతని పేరును తొలగించినట్టు అర్థం కాదని వివరణ ఇచ్చారు. పైన పేర్కొన్న వారికి ఈసీఐనెట్‌లో డాటాను సరిచేసేందుకు నోటీసులు జారీ అవుతున్నాయని చెప్పారు.
‘సర్’ ప్రక్రియలో కేంద్ర మంత్రి జైశంకర్, ఆయన భార్యను ‘చివరి సర్‌తో మ్యాప్ చేయని’ విభాగంలో ఉంచారు. అంటే వారి ప్రస్తుత రికార్డులను 2002లో జరిగిన గత సవరణ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాతో అనుసంధానించలేక పోయారు. ప్రస్తుతం ఈ జంట న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుందర్ బాగ్‌లో తమ ఓట్లను నమోదు చేసుకోవడమే దీనికి కారణం. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, అతని భార్య వనితా సూద్, అతని తల్లి కమలేశ్ సూద్‌లు కూడా ఇదే క్యాటగిరీలో ఉన్నారు.
ఈ జాబితాలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అతని భార్య సునీత ద్వివేది కూడా ఉన్నారు. వారు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక సిసోడియా, అతని కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ కాగా, సిసోడియాకు నోటీస్ జారీకి నిర్దిష్టమైన కారణాన్ని నోటీసులో పేర్కొనలేదు. అతని భార్య సీమా సిసోడియాకు ‘సొంత పేరులో తేడా’ విభాగంలో నోటీస్ జారీ కాగా, అతని కుమారుడికి ‘తల్లిదండ్రుల పేరు సరిపోలడం లేదు’ జాబితాలో నోటీస్ జారీ చేశారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్మన్ తుహిన్ కాంతా పాండే, ప్రధాని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, ఆరోగ్య శాఖ కార్యదర్శి సలీల శ్రీవాస్తవ తదితరులకు ‘అన్మ్యాప్డ్’ జాబితాలో నోటీసులు జారీ అయ్యాయి.
‘సర్’ లక్ష్యానికి విరుద్ధంగా అర్హులైన వారి పేర్లను కూడా తొలగిస్తున్నారని ప్రముఖుల పేర్లు కూడా తొలగించడాన్ని బట్టి అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ప్రముఖులు కాబట్టి వారి పేర్లు తొలగిస్తూ నోటీసులు జారీ చేస్తే తెలిసి స్పందిస్తున్నారు. కానీ సామాన్యులకు ‘సర్’ నుంచి ఎలాంటి నోటీసులు రాకుండానే వారి పేర్లను జాబితాలో నుంచి తొలగిస్తున్నారని ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలున్నాయి.