ఆసియా గేమ్స్‌లో భారత్‌కు అద్భుత ఆరంభం. పతక పోటీలు మొదలైన తొలి రోజే షూటర్లు రెండు రజతాలు అందుకోగా.. భారత మహిళల టీ20 క్రికెట్ జట్టు ఫైనల్ చేరి స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో భారత ఫైటర్ సుచికా తరియాల్ సెమీఫైనల్ చేరి కాంస్యం ఖాయం చేసుకుంది. మరో అరంగేట్ర ఆట టెక్బాల్లో క్విమ్సి డిసౌజా నిరాశ పరిచినా.. హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో భారత జట్లు పతకాల వేటను సానుకూల విజయాలతో ప్రారంభించాయి.
నగోయా (జపాన్) : భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత షూటర్లు ఆసియా గేమ్స్ పోటీల తొలి రోజే అదరగొట్టారు. స్టార్ షూటర్ ఇలవేనిల్ వలారివన్ ముందుండి నడిపించగా.. రెండు రజత పతకాలతో శుభారంభం చేశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఇలవేనిల్ డబుల్ ధమాకా మోగించింది. ఆదివారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో తమిళనాడుకు చెందిన వలారివన్ 0.6 పాయింట్ల తేడాతో కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది. తను 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఆతిథ్య జపాన్‌కు చెందిన హినాటా తైచి 253.0 పాయింట్లతో ఆసియా గేమ్స్ రికార్డు నమోదు చేస్తూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత బాన్ హ్యో జిన్ (దక్షిణ కొరియా – 230.4 పాయింట్లు) కాంస్యం గెలుచుకుంది. 2018, 2022 ఆసియాడ్, 2024 ఒలింపిక్స్‌లో నిరాశ పరిచిన ఇలవేనిల్‌కు మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్లలో ఇదే తొలి వ్యక్తిగత పతకం కావడం విశేషం. హోరాహోరీగా సాగిన తుదిపోరులో అద్భుతంగా ఆడిన భారత షూటర్ 17వ షాట్ తర్వాత కొరియా షూటర్ బాన్ కంటే 1.4 పాయింట్ల ఆధిక్యంలో టాప్‌లోకి వచ్చి పసిడి పతకంపై ఆశలు రేపింది. చివరి రెండు షాట్లకు ముందు 0.3 పాయింట్స్ తేడాతో రెండో స్థానంలో నిలిచింది. కానీ, చివరి రెండు షాట్లలో జపాన్ షూటర్ వరుసగా 10.6, 10.2 స్కోర్లు రాబట్టగా.. భారత అమ్మాయి 10.4, 10.1 పాయింట్లు సాధించి రజతానికి పరిమితం అయింది. పతకం ఖాయమైన తర్వాత రిలాక్స్ అవ్వడంతో ప్రత్యర్థికి పుంజుకునే చాన్స్ ఇచ్చానని ఇలవేనిల్ చెప్పింది.
టీమ్ విభాగంలో ఇలవేనిల్, సోనమ్ ఉత్తమ్ మస్కార్, ఆసియాడ్ అరంగేట్ర షూటర్ విదార్స వినోద్‌తో కూడిన జట్టు 1898.0 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం అందుకుంది. చైనా జట్టు 1904.2 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా, జపాన్ 1897.1 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. కేరళకు చెందిన 27 ఏండ్ల విదార్స రెండు నెలల క్రితమే 10మీ. ఎయిర్ రైఫిల్‌లో శిక్షణ ప్రారంభించినప్పటికీ భారత జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

ఆసియాడ్ తొలి మ్యాచ్‌ల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు మళ్లీ కాషాయ రంగు జెర్సీలలో బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. గత నెల ప్రపంచకప్‌లో హాకీ జట్లు తొలిసారిగా కాషాయ రంగు జెర్సీలు ధరించడం వివాదానికి దారి తీయడంతో ఆసియాడ్‌లో సాంప్రదాయ నీలిరంగు జెర్సీలనే వాడతామని హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ స్పష్టం చేశాడు. కానీ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్‌పై మెన్, విమెన్స్ టీమ్స్ మళ్లీ ఆరెంజ్ జెర్సీల్లో దర్శనమిచ్చాయి. భారత్‌కు అసలు బ్లూ జెర్సీనే కేటాయించలేదని, కాషాయంతో పాటు వైల్-స్కై బ్లూ కలర్ జెర్సీలను టిర్కీనే స్వయంగా ఆమోదించారని హెచ్ఐ అంతర్గత వర్గాలు చెప్పడం కొసమెరుపు.
హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు భారీ విజయాలతో గేమ్స్‌ను ఘనంగా ఆరంభించాయి. మెన్స్ కేటగిరీలో భారత్ 13-1తో ఇండోనేషియాను చిత్తు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ వరుస గోల్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. దిల్‌ప్రీత్ (18, 19, 37, 49వ నిమిషాల్లో) నాలుగు ఫీల్డ్ గోల్స్‌తో రెచ్చిపోగా షీలానంద్ లక్రా (6, 35వ), సుఖ్జీత్ సింగ్ (38, 48వ) తలా రెండో గోల్స్ చేశారు. అభిషేక్ (12), రజిందర్ (19), మన్దీప్ (21), జుగరాజ్ (47)తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (28) చెరో గోల్ కొట్టారు. అమ్మాయిల విభాగంలో భారత్ 19-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. యువ స్ట్రైకర్ దీపికా సెహ్రావత్ ఏకంగా ఎనిమిది (8, 22, 25, 33, 36, 38, 41, 54వ నిమిషాల్లో) గోల్స్‌తో రెచ్చిపోయింది. మిడ్ ఫీల్డర్ ఇషికా (11, 42, 54) మూడు గోల్స్ కొట్టింది.
ఆసియాడ్ అరంగేట్ర ఆటల్లో ఒకటైన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో 36 ఏండ్ల సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీ విభాగం సెమీఫైనల్ చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో భారత ఫైటర్ 2-0తో మంగోలియాకు చెందిన బైగల్మాను ఓడించి ముందంజ వేసింది. 12 ఏండ్ల వయస్సులో వీధి పోకిరీల వేధింపుల వల్ల కలిగిన మానసిక వేదన నుంచి బయటపడటానికి జూడో నేర్చుకొని అంతర్జాతీయ వేదికలపై పలు పతకాలు సాధించిన సుచిక 2024లో ఎంఎంఏ వైపు అడుగులు వేసి తక్కువ కాలంలోనే ఈ ఆటలో అద్భుతాలు చేస్తోంది.

కాగా, పురుషుల ఎంఎంఏ ఫైటర్ వరుణ్ సన్యాల్ తనకు వసతి కేటాయించిన క్రూయిస్ షిప్లో స్పృహ తప్పి పడిపోవడంతో వైద్యపరంగా అతడిని పోటీకి అనర్హుడిగా ప్రకటించారు. మరోవైపు స్విమ్మింగ్‌లో రిషబ్దాస్, ఉషులో సూరజ్ సింగ్ నిరాశపరిచారు.
ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలకు ముందు భారత పతకాధారి స్టార్ షూటర్ మను భాకర్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఓపెనింగ్ సెర్మనీ కోసం భారత ఒలింపిక్ సంఘం ఇచ్చిన అధికారిక సంప్రదాయ దుస్తులు, బూట్ల కొలతలు ఆమెకు సరిపోలేదు. పరేడ్‌కు సమయం దగ్గరపడటంతో ఆమె ఆఖరి నిమిషంలో సహాయ సిబ్బందిలో ఓ సభ్యురాలి దుస్తులను అప్పుగా తీసుకుని వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది.

ఇప్పటికే భారత పురుషుల క్రికెట్ జట్టు ఆటగాళ్లకు జెర్సీల సైజులు సరిపోక సమస్యలు తలెత్తగా, పతాకధారి భాకర్‌కు కూడా సైజింగ్ లోపాల వల్ల ఇలాంటి పరిస్థితి రావడం కిట్ సప్లయర్లు, ఐఓఏ నిర్వహణ లోపాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది.
టెక్బాల్లో చరిత్రాత్మక పతకం సాధించే దిశగా అడుగులు వేసిన భారత టెకర్ క్విమ్సి డిసౌజా రెండు ఈవెంట్లలో తృటిలో పతకాన్ని కోల్పోయింది. మహిళల సింగిల్స్ కాంస్య పోరులో ఆమె 0-2 (11-12, 11-12)తో జపాన్ ప్లేయర్ సకమొటొ చేతిలో పోరాడిఓడింది. ఆ మ్యాచ్ ముగిశాక ఐదు నిమిషాల్లోనే అనాస్ బేగ్‌తో జతకట్టి ఆడిన మిక్స్డ్ డబుల్స్‌లో 0-2 (9-12, 6-12)తో వియత్నాం ద్వయం హోవాంగ్ మిన్హ్-గియా ట్రిన్హ్ చేతిలో ఓటమిపాలై ఈ క్రీడల్లో తన ప్రయాణాన్ని ముగించింది.
టేబుల్ టెన్నిస్ గ్రూప్ దశలో మహిళల జట్టు వరుస విజయాలతో క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకోగా అబ్బాయిలు ఒకటి గెలిచి మరోదాంట్లో ఓడారు. గ్రూప్-ఎఫ్‌లో ఉన్న భారత విమెన్స్ టీమ్ మొదటి పోరులో 3-0తో ఇండోనేషియాను క్లీన్‌స్వీప్ చేసింది. తమ రెండో మ్యాచ్‌లో 3-2తో సింగపూర్‌ను ఓడించింది. రెండో పోరులో 1-2తో వెనుకబడ్డా రివర్స్ సింగిల్స్ మ్యాచుల్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, యశస్విని భారత్‌కు విజయాన్ని అందించారు. పురుషుల జట్టు ఇండోనేషియాపై 3-0తో ఈజీగానే గెలిచినా తర్వాతి పోరులో 0-3తో ఇరాన్ చేతిలో ఓడింది.

ఈసారి ఆసియాడ్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు తొలి పోరులో 3-0తో కజకిస్థాన్‌ను ఓడించి క్వార్టర్స్ చేరుకుంది. మొదట సింధు 21-7, 21-9తో కమిల స్మగులొవపై గెలువగా రెండో సింగిల్స్‌లో ఉన్నతి 21-7, 21-10తో అలిస్సాను ఓడించింది. మూడో మ్యాచ్‌లో తన్వి 21-5, 21-10తో డయానా నమెనొవను చిత్తుచేసింది. క్వార్టర్స్‌లో భారత్ కఠిన ప్రత్యర్థి జపాన్‌తో తలపడనుంది.
టోక్యో: తాజా ఎడిషన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన అతి పిన్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన చైనా స్విమ్మర్, 13 ఏండ్ల యు జిదీ ఆటలోనూ అదరగొట్టింది. పోటీల తొలి రోజే సంచలన ప్రదర్శనతో రికార్డుల దుమ్ముదులిపింది. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో గేమ్స్ రికార్డు బ్రేక్ చేసి స్వర్ణం గెలుచుకుంది.

వచ్చే నెలలో 14వ యేట అడుగుపెట్టనున్న ఈ బడి ఈడు బాలిక.. 2 నిమిషాల 05.08 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసి గత ఎడిషన్ (హాంగ్జౌ)లో చైనాకే చెందిన జాంగ్ నెలకొల్పిన 2 నిమిషాల 05.57 సెకన్ల రికార్డును అధిగమించింది