సంగారెడ్డి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): దేశంలో పనిచేస్తున్న డిఫెన్స్ స్టార్టప్ కంపెనీలు అమెరికా మార్కెట్లో విస్తరించేందుకు వీలుగా ఐఐటీ హైదరాబాద్, అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విభాగం సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రతినిధులు డీ అలాన్ జాన్సన్ (లెఫ్టినెంట్ కల్నల్, యూఎస్ ఎయిర్‌ఫోర్స్), జోనాథన్ మాంగ్రమ్ (దక్షిణాసియా సలహాదారు) ఇండో-యూఎస్ క్రాస్ లింక్స్ యాక్సిలరేటర్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
ఐఐటీహెచ్‌లోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, అమెరికాకు చెందిన హెచ్4ఎక్స్ల్యాబ్ సంయుక్తంగా ఈ యాక్సిలేటర్ నడపనున్నాయి. రక్షణ రంగంలో కలిసి పనిచేసేందుకు వీలుగా ఇండియా, అమెరికా సంయుక్తంగా ఇండస్ ఎక్స్ (ఇండియా-యూఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగానే దేశంలోని రక్షణరంగ స్టార్టప్ కంపెనీలను అమెరికా మార్కెట్లో విస్తరించేందుకు వీలుగా క్రాస్ లింక్స్ యాక్సిలరేటర్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ ఇన్షర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్ పర్యవేక్షణలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ 130కిపైగా స్టార్టప్ కంపెనీలకు మద్దతుగా నిలిచాయని, రూ.1200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు పేర్కొన్నారు.