హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మారుతున్న ఆహారపు అలవాట్లు, చిరు ధాన్యాల వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో మిల్లెట్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఆగ్రోస్) నిర్ణయించింది. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘మిల్లెట్ స్టాల్స్’ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. తొలిదశలో జీహెచ్ఎంసీలో వంద స్టాళ్లు, జిల్లా కేంద్రాల్లో ఒక్కో స్టాల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
ప్రజలకు నాణ్యమైన చిరుధాన్యాలను సాధారణ ధరలకు, తక్కువ సమయంలో అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందుకోసం చిరుధాన్యాలు, ఆహార రంగంలో సేవలు అందిస్తున్న హరేరామ-హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ ఫౌండేషన్ సేకరించి అందించే చిరు ధాన్యాలను వినియోగదారులకు విక్రయించనున్నది. ఇప్పటికే ఆగ్రోస్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 1500 వరకు రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నది. యువతకు ఉపాధి కల్పించడంతోపాటు రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నది.
మహిళలకు ఉపాధి అవకాశం
మిల్లెట్ స్టాల్స్ ద్వారా నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించాలని ఆగ్రోస్ లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందులో భాగంగానే ఈ స్టాల్స్‌ను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ కోర్సు పూర్తి చేసిన యువతులకు ప్రథమ ప్రాధాన్యంలో ఈ స్టాల్స్‌ను కేటాయించనున్నది. ఈ స్టాల్స్‌లో కేవలం ముడి చిరు ధాన్యాలనే కాకుండా మిల్లెట్స్ ఉత్పత్తులను కూడా విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నది. స్థానికంగానే మిల్లెట్స్ ఉత్పత్తులను తయారుచేసేలా ప్రత్యేకంగా కిచెన్‌ను కూడా ఏర్పాటు చేయించనున్నది.
రుణ సౌకర్యం
పెట్టుబడి పెట్టలేని వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు సిద్ధమైంది. స్టాల్ కెపాసిటీ ఆధారంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నది. హెచ్‌డీఎఫ్‌సీతోపాటు మరికొన్ని బ్యాంకులతో ఒప్పందం కూడా చేసుకొన్నది. చిరు ధాన్యాలు విక్రయించడం, ఆహార పదార్థాల తయారీలో మహిళలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ల (ఐఐఎం)తో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మిల్లెట్ స్టాల్స్‌తో అటు ప్రజలకు నాణ్యమైన చిరుధాన్యాలు, ఉత్పత్తులను అందజేయడంతోపాటు మహిళలు ఆర్థికంగా స్థిరపడేలా చేడయమే లక్ష్యంగా ఆగ్రోస్ ముందుకు వెళ్తున్నది.