శాన్ ఫ్రాన్సిస్కో: యాపిల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు నుంచి టిమ్ కుక్( Tim Cook) వైదొలగనున్నారు. ఆయన ఆ కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక యాపిల్ సంస్థ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి జాన్ టెర్నస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. యాపిల్ సంస్థ బోర్డు డైరెక్టర్లు ఈ మార్పును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ వరకు టిమ్ కుక్ సీఈవోగా కొనసాగనున్నారు. ఈ సమయంలో ఆయన టెర్నస్‌కు అధికారాలను హ్యాండోవర్ చేస్తారు. యాపిల్ సంస్థ కాబోయే సీఈవో జాన్ టెర్నస్ ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ శాఖకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్నారు. యాపిల్‌కు చెందిన కీలక ఉత్పత్తులను డెవలప్ చేయడంలో టెర్నస్ ముఖ్య పాత్ర పోషించారు. సీఈవో పోస్టు నుంచి తప్పుకున్న తర్వాత టిమ్ కుక్ కంపెనీకి సహకరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ పాలసీమేకర్లతో ఆయన చర్చించనున్నారు.
15 ఏళ్ల పాటు టిమ్ కుక్ సీఈవో పోస్టులో ఉన్నారు. 1998లో ఆయన యాపిల్ సంస్థలో చేరారు. 2011లో ఆ కంపెనీ సీఈవో అయ్యారు. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ విజన్ ప్రో లాంటి కేటగిరీలన్నీ ఆయన సీఈవోగా ఉన్న సమయంలో వచ్చినవే. ఐక్లౌడ్, యాపిల్ పే, యాపిల్ టీవీ, యాపిల్ మ్యూజిక్ సర్వీసులు కూడా ఆయన తెచ్చినవే. యాపిల్ సంస్థ ఉత్పత్తులను విస్తృతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. కొత్త సీఈవోగా బాధ్యలు చేపట్టనున్నట్లు జాన్ టెర్నస్ కూడా యాపిల్ సంస్థలో సుమారు 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు.