Sai Pallavi | తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మకమైన రామాయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె, తాజాగా నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సాయి పల్లవి మాట్లాడుతూ… సుమారు నాలుగేళ్ల క్రితం తాను ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్న సందర్భాన్ని వివరించారు. ఆ సమయంలో ఒక రిపోర్టర్ “మీ మలయాళ నటీనటులు తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడతారు?” అని ప్రశ్నించారని చెప్పారు. దానికి తాను “నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదు” అని నిజం చెప్పానని తెలిపారు.
అయితే ఆ సమాధానం తర్వాత పరిస్థితులు ఎలా మారాయో చెప్పుకుంటూ సాయి పల్లవి బాధ వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల తర్వాత ఒక పత్రికలో “మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది” అనే హెడ్లైన్ చూసి తాను షాక్కు గురయ్యానన్నారు. తన మాటలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేయడం బాధ కలిగించిందని వెల్లడించారు. మరో సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఒక మహిళ తనతో మలయాళంలో మాట్లాడిన తర్వాత మీకు కోపం వస్తుందేమో” అని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు. వెంటనే “నాకు అలాంటి భావం ఎప్పుడూ లేదు అని చెప్పినా, ఆమె నమ్మలేదని తెలిపారు. ఈ సంఘటనలు తనను చాలా బాధపెట్టాయని, తాను చెప్పని విషయాలు తనపై మోపడం సరైంది కాదని అన్నారు.
భాషల విషయానికి వస్తే తాను ఎప్పుడూ ఎలాంటి బేధాలు చూపనని సాయి పల్లవి స్పష్టం చేశారు. నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పాను. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎప్పుడూ ఏ భాషనూ చిన్నచూపు చూడను అని క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే తన మాతృభాష తమిళమని చెప్పానని, అంతేకాని ఇతర భాషలను తిరస్కరించే ఉద్దేశం ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇచ్చిన వివరణతో గతంలో వచ్చిన వివాదానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.