Madhu Priya | తెలంగాణ జానపద గీతాలకు ప్రాణం పోసిన గాయని మధుప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి తన పాటలతో కాదు, రాజకీయ వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో జరిగిన ‘కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ’లో మధుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభకు హాజరైన వేలాది మంది ప్రజలను ఆమె తన జానపద గీతాలతో ఉర్రూతలూగించారు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వాన్ని కీర్తిస్తూ “మళ్లీ బాపు రావాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సభ అనంతరం మీడియాతో మాట్లాడిన మధుప్రియ, “ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఒక ఎమోషన్. రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను ఎవరూ చెరిపివేయలేరు” అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల సమస్యలు పెరిగాయి. కూల్చివేతలు ఎక్కువయ్యాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ బాగుంది. అందుకే మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలి” అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే “నేను ఎప్పుడూ కేసీఆర్ పక్షమే ఉంటాను. రేవంత్ రెడ్డి అడిగినా కూడా నేను వారి కోసం పాటలు పాడను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధుప్రియ ప్రస్థానం విషయానికి వస్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆమె చిన్న వయసులోనే జానపద గీతాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ‘ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని’ పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు. ప్రజాకళాకారుడు గద్దర్‌తో వేదికలు పంచుకోవడం ఆమెకు మరింత గుర్తింపునిచ్చింది.తరువాత సినీరంగంలోకి అడుగుపెట్టి పలు సూపర్ హిట్ పాటలతో తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ‘వచ్చిండే’ పాటతో ఆమె కెరీర్‌కు కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో పాటలు పాడుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్-1లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఇటీవల కాళేశ్వర ఆలయంలో పాట చిత్రీకరణ వివాదంతో కూడా వార్తల్లో నిలిచిన ఆమె, ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.