హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపడుతున్నాయి. కొనుగోళ్లు గణనీయం గా తగ్గి నిత్యం 40 శాతం మేర మిగిలి కుళ్లిపోతుండడంతో పారబోస్తున్నామని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో రోజుకు రూ.2 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. రెండు నెలలుగా రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాట, చికుడు లాంటి కూరగాయల ధరలు కిలో రూ.100 దాటాయి. బీన్స్, పచ్చిమిర్చి రూ.120 వరకు చేరాయి.
బెండ, వంకాయ, దొండ రూ.60 దాటాయి. రాష్ట్రంలో కూరగాయల సాగు ఆలస్యం కావడంతో అధికశాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా చార్జీలు, గుత్తేదారుల లాభా లు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చిరువ్యాపారులు వీటిని కొనుగోలు చేసి కొంతమేర లాభం చూసుకోవాల్సి ఉండడంతో ధరలు మరింత పెరుగడంతో వినియోగదారులు కొనేందుకు జంకుతున్నారు. ధరలు పెరిగినప్పటి నుంచి కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. ప్రధానంగా టమాట అమ్మకాలు 55 శాతం మేరకు పడిపోయినట్లు పేర్కొంటున్నారు. ఇతర కూరగాయల పరిస్థితి సైతం ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జూలైలో 96 వేల క్వింటాళ్లు వృథా..
రైతుబజార్లకు జూలైలో 1,86,373 క్వింటాళ్ల కూరగాయలు వచ్చాయి. ఇందులో కేవలం 90 వేల క్వింటాళ్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. టమాట 17,906 క్వింటాళ్లకు 10,220, వంకాయ 14,943 క్వింటాళ్లకు 8,602, మిర్చి 8,526 క్వింటాళ్లకు 3,502 క్వింటాళ్లు మాత్రమే విక్రయించినట్టు మారెట్ లెకలు చెబుతున్నాయి.