హైదరాబాద్, జనవరి 1 (నమస్తేతెలంగాణ) : దేశంలోని అటవీ ప్రాంతాల్లో 2023-24 ఏడాదిలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదాల పరంగా తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో నిలవగా, తొలి, రెండో స్థానాల్లో ఏపీ, మహారాష్ట్ర ఉన్నాయి. 2023 నవంబర్ – 2024 జూన్ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5,286.76 చ.కి.మీ. విస్తీర్ణంలో అగ్నిప్రమాదాల్లో అటవీ భూమి కాలిపోగా, మహారాష్ట్రలో మొత్తం కాలిపోయిన అటవీ ప్రాంతం 4,095.04 చదరపు కి.మీ.గా నమోదైంది. ఆ తర్వాత తెలంగాణలో 3,983.28 చదరపు కిలోమీటర్లుగా నమోదైంది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సంస్థ తాజాగా విడుదల చేసిన 2023-24 సీజన్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 52 టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో అత్యధికంగా అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ అడవుల్లో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది.