ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందుతున్నది. దీంతో ఈ దవాఖానల్లో చేరిన బాధితులు కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుతున్నారు. మొదటి దశ లాక్డౌన్ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రభుత్వ దవాఖానలో 528 మంది చేరగా 511 మంది కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మరో 17 మంది చికిత్స పొందుతున్నారు. వీరు కూడా త్వరలో పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరనున్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇక ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ దవాఖాన, మధిర సివిల్ దవాఖానలోనూ అనేకమంది, ఖమ్మం ప్రధాన వైద్యశాలలోనూ వందలాదిమంది సంపూర్ణంగా కోలుకున్నారు. ఇలా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతుండటంతో ప్రజలు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు.