హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతులతో మరో 15వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయని, ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీ ద్వారా వాటిని భర్తీచేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. గ్రంథాలయాలు, స్టడీహాళ్ల ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 25వేలతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్ ప్రభుత్వం కేవలం 11వేల పోస్టులకే పరిమితం చేసిందని వాపోయారు. టీచర్లకు కల్పించిన పదోన్నతులతో 15వేల పోస్టులు ఖాళీఅయ్యాయ ని, వాటిని ఇదే డీఎస్సీలో చేర్చి భర్తీచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్కూల్ అసిస్టెంట్ల బదిలీ
మల్టీజోన్ -2లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా 12 జిల్లాల్లో 6,013 మంది స్కూల్ అసిస్టెంట్లను సోమవారం విద్యాశాఖ అధికారులు బదిలీచేశారు. సంగారెడ్డి 834, జనగాం 335, యాద్రాద్రి 562, మేడ్చల్ 456, వికారాబాద్ 641, మహబూబ్‌నగర్ 397, జోగులాంబ గద్వాల 305, వనపర్తి 310, నాగర్‌కర్నూల్ 451, నల్గొండ 876, సూర్యాపేట 575, నారాయణపేట జిల్లాలో 271 స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు.
ప్రజావాణిలో ఫ్రీ భోజనం
ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం ప్రతి సోమవారం ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించాలని పెద్దపల్లి లయన్స్ క్లబ్ నిర్ణయించింది. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో మొబైల్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయగా, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు జే అరుణ శ్రీ, జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్‌తో కలిసి ప్రారంభించారు.
డీఎంఈకి 406 కోట్లు
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి ప్రభుత్వం రూ.406.75 కోట్లు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.