బూర్గంపహాడ్, ఆగస్టు 29 : కుళ్లిపోయిన కోడిగుడ్లతో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సారపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. సారపాక మసీద్ రోడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులు కుళ్లిపోయిన కోడిగుడ్లతో భోజనం పెట్టారు. విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు.
మధ్యాహ్న భోజన కార్మికులను ప్రశ్నించగా వారు దురుసుగా మాట్లాడటంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళంవేసి నిరసనకు దిగారు. తహసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంఈవో యదుసింహరాజు పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని మధ్యాహ్న భోజన కార్మికులను హెచ్చరించారు. ప్రతిరోజూ ఇద్దరు ఉపాధ్యాయులు ఆహారాన్ని రుచి చూసిన తర్వాతనే పిల్లలకు వడ్డించాలని ఆదేశించారు.