హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : వాడేసిన పూలతో ధూప్‌స్టిక్స్.. తృణధాన్యాలతో కొత్త తరహా ఆహారాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు తయారుచేసి, తమ ప్రతిభను చాటిచెప్పారు. కరీంనగర్ జిల్లా మహిళా డిగ్రీకాలేజీ విద్యార్థినులు ఎకో ఫ్రెండ్లీ ధూప్స్టిక్స్ను తయారుచేశారు. డాక్టర్ ఎం ప్రశాంతి పర్యవేక్షణలో విద్యార్థులు పీ శ్రీయ, ఎస్డీ తస్నీమా, సౌమ్య, హర్షిత, ఆయేషా అక్తర్, మాధురి కలిసి ఆలయాల్లో పూజకు వినియోగించిన పువ్వులతో ధూప్స్టిక్స్ను తయారుచేశారు. ఈ ప్రాజెక్ట్‌కు కెమిస్ట్రీ సబ్జెక్టులో మొదటి బహుమతి దక్కింది. అలాగే, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మిల్లెట్ బేస్డ్ ఫెర్మెంటెడ్ ఫుడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించి, మొదటి బహుమతి గెలుచుకొన్నారు. డాక్టర్ పీ పల్లవి పర్యవేక్షణలో విద్యార్థులు ప్రియాంక, హిమజ, నాగసాయిశ్రీ, భరత్, నవీన్‌కుమార్, దీక్ష కలిసి తృణధాన్యాలతో ఆహారాన్ని తయారుచేసి ప్రశంసలందుకొన్నారు. మైక్రో బయాలజీ – బయోటెక్నాలజీ సబ్జెక్టులో ఈ ప్రాజెక్టు ద్వారా బహుమతి పొందారు.
42 ఉత్తమ ప్రాజెక్టుల ఎంపిక
వీరి ప్రాజెక్టుల రూపకల్పనకు ‘జిజ్ఞాస’ వేదికైంది. 202223 సంవత్సరానికి జిజ్ఞాస నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు మొత్తం 1,129 ప్రాజెక్టులను రూపొందించారు. వీటిలో 286 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, 42 ఉత్తమ ప్రాజెక్ట్‌లుగా నిలిచాయి. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించే కార్యక్రమానికి కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ ముఖ్యఅతిథిగా పాల్గొని, విజేతలకు బహుమతులిస్తారు. మొదటి బహుమతిగా రూ.25వేలు, రెండో బహుమతిగా రూ. 18వేలు, మూడో బహుమతిగా రూ.10వేల నగదును అందజేస్తారు. విద్యార్థులను ప్రోత్సహించిన సూపర్వైజర్/ మెంటార్‌కు రూ. 5వేల నుంచి 2వేల వరకు నగదు బహుమతులిస్తారు.