ప్రజారోగ్యంలో తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. గులాబీ రంగు టమాటలు. కంటి చూపును పెంచే, క్యాన్సర్‌ను నిరోధించే గుణాలున్న టమాటలు ఇవి. దేశంలోనే తొలిసారి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధకులు వీటిని పండించారు. ఈ టమాటల్లో విటమిన్ ఏ, క్యాన్సర్ నిరోధక ‘ఆంథోసయానిన్’ పుష్కలంగా ఉంటుందట. తక్కువ కాలంలోనే, ఎక్కువ దిగుబడిని అందించే ఈ గులాబీ టమాటలను జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. త్వరలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): శాస్త్రపరిశోధనల్లో విశేష కృషి చేస్తున్న తెలంగాణ శాస్త్రవేత్తలు ప్రజారోగ్యాన్ని పెంపొందించే మరో ఆవిష్కరణ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యావ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దేశంలోనే మొదటిసారి గులాబీ రంగు టమాటాలను సృష్టించారు. ఇందులో కంటి చూపును మెరుగుపర్చే విటమిన్ ఏ, క్యాన్సర్‌ను నిరోధించే ఆంథోసయానిన్ పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న ఈ టమాటా పంట 55 రోజుల్లోనే కాపునకు వస్తుంది. టమాటా పంటకు తీవ్ర నష్టం కలిగించే నులిపురుగు తెగులును ఇది తట్టుకొంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న గులాబీరంగు టమాట పంట సాధారణ రకాలకంటే అధిక దిగుబడి ఇస్తున్నట్టు గుర్తించారు. ఈ మొక్కకు కొమ్మలు అధికంగా వచ్చి, కాయలు ఎక్కువ కాస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దిగుబడి, పండ్ల నాణ్యత, పంటకాలం, చీడ పీడలను తట్టుకునే గుణాలపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా ఎరుపు టమాటల్లో లైకోపిన్ ఉంటుందని, గులాబీ టమాటాల్లో ఆంథోసయానిన్ ఉంటుందని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, ఇతర గులాబీ రంగులో ఉండే పండ్లలో ఆంథోసయానిన్ అధికంగా ఉంటుంది. ఇది టమాటాల్లో కూడా దొరికితే తకువ ధరకే వినియోగదారుల అవసరాలు తీరుతాయని పేర్కొంటున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సాగు చేస్తున్న గులాబీరంగు టమాట పంటను మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్లు ఇటీవల వేర్వేరుగా పరిశీలించి పంట వివరాలను అడిగి తెలుసుకొన్నారు.
ఉద్యాన వర్సిటీ ఇచ్చిన గులాబీ, నారింజ రంగు టమాటాల్లో దిగుబడి విపరీతంగా వస్తున్నది. కొమ్మలు, కాయల సంఖ్య చాలా ఎకువగా ఉన్నది. మొదటి పూతలోనే అరవై కాయలు వచ్చాయి. నులిపురుగుల సమస్య కూడా గమనించలేదు. సేంద్రియ పద్దతిలో వీటిని సాగు చేస్తున్నాం. దీంతో వినియోగదారుల నుంచి మంచి మద్దతు లభిస్తున్నది.
– లైక్ అహ్మద్, ఏడీహెచ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జీడిమెట్ల
గులాబీ, ఆరెంజ్ టమాటలు ఆకర్షణీయంగా ఉన్నాయి. గులాబీ రంగు టమాటాల్లో ఆంథోసయానిన్, విటమిన్ ఏ ఎకువగా ఉన్నది. ఆంథోసయానిన్ ఎకువగా ఉన్న పండ్లు తింటే క్యాన్సర్‌ను నిరోధించవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. విటమిన్ ఏ ఎకువగా ఉండే టమాటాలు కంటి చూపు మెరుగు పరచడానికి పనికొస్తాయి. వీటిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేస్తాం.
– ఎల్ వెంకట్రామ్ రెడ్డి, తెలంగాణ ఉద్యాన శాఖ డైరెక్టర్
రోజూ తీసుకొనే కూరగాయల ద్వారానే శరీరానికి ఔషధ గుణాలు లభించేలా చూడాలనే ఉద్దేశంతో మొదటిసారి ఆంథోసయానిన్ ఎకువగా ఉండే గులాబీ రంగు టమాటను అభివృద్ధి చేశాం. 100 గ్రాముల టమాటలో 15 మిల్లీగ్రాముల ఆంథోసయానిన్ ఉంటుంది. క్యాన్సర్ రాకుండా ఇది నిరోధిస్తుంది. విత్తనం నాటిన 55 రోజుల్లోనే మొదటి కాత వస్తుంది. నులిపురుగుల తెగులును కూడా తట్టుకొంటుంది. దేశవాళీ టమాటాల్లాగానే ఇవి పుల్లగా ఉంటాయి. మొక్క పొడవుగా పెరుగుతుంది. ఒకొక పండు బరువు 20 గ్రాములు ఉంటుంది. ఈ టమాట తోలు పలుచగా ఉండటంవల్ల త్వరగా ఉడుకుతుంది. అయితే ఈ రకం పండ్లు గరిష్ఠంగా నాలుగు రోజుల కంటే ఎకువ నిల్వ ఉండవు. త్వరలోనే దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– డాక్టర్ పిడిగం సైదయ్య, ఉద్యాన వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్