పెద్దపల్లి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారతను పెంచేలా.. వారి హకులను కాపాడేలా రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం తరఫున మహిళలకు మంచి శుభవార్త చెప్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని భిక్షేశ్వరస్వామి ఆలయంలో శ్రీధర్‌బాబు పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుభవార్తకు సంబంధించిన వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు, నిపుణుల బృందం పరిశీలిస్తున్నదని, వారిచ్చే నివేదిక మేరకు సర్కారు తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్ట్‌ల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ వేసవిలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు.