కరీమాబాద్, జూలై 30 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆదివారం వరంగల్లోని శంభునిపేటలో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో 200 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి గులబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి పక్షాలకు చోటు లేదని స్పష్టం చేశారు.