హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడంలో ఐటీ కంపెనీలు, సంస్థలు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోగా, తాజాగా హ్యాకథాన్ల బాటలో పయనిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన అమెజాన్, డెలాయిట్, పీడబ్ల్యూసీ వంటి సంస్థలు హ్యాకథాన్ల ద్వారానే కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకొంటున్న విషయం తెలిసిందే. ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభంకానున్నది. బీటెక్ సహా వృత్తివిద్యాకోర్సుల్లో నాలుగో సంవత్సరంలోని విద్యార్థులంతా ప్లేస్‌మెంట్స్‌కు సిద్ధపడుతున్నారు. కంపెనీలు ఔత్సాహికులను రిక్రూట్ చేసుకొనేందుకు ముందుకొస్తున్నాయి. అయితే, కంపెనీలు గతం కంటే భిన్నంగా.. హ్యాకథాన్ల బాటపడుతున్నాయి.
ప్లేస్‌మెంట్స్ తగ్గేనా..
ఈ ఏడాది ఐటీ ప్లేస్మెంట్స్పై మాంద్యం ప్రభావం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కొత్త ప్రాజెక్ట్‌లు అంత ఆశాజనకంగా ఉండటం లేదు. ఉన్న ప్రాజెక్ట్‌లను కొసాగించడంలో సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఈ ఏడాది ప్లేస్మెంట్ సీజన్ అటు విద్యార్థులకు, ఇటు కాలేజీలకు సవాల్లాంటిది’ అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా కంపెనీలు స్కిల్డ్ ఓరియంటెండ్ నియామకాలపై దృష్టిసారించాయి. దీంతో ప్రెషర్స్‌కు అవకాశాలు తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలే కాకుండా నిపుణలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎమర్జింగ్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్, డాటా అనలెటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఈవీ, సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఫ్యూయల్ వంటి రంగాల్లోని విద్యార్థులకు ఢోకా ఉండదని చెబుతున్నారు. ఐటీ రంగం పరిస్థితి ఇలా ఉంటే మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాల్లో ప్లేస్‌మెంట్స్ జోరుగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
పరిస్థితులిలా..
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సీఈఐఎల్హెచ్ఆర్.. ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు 25- 30% తగ్గవచ్చని అంచనావేసింది. మార్కెట్లో ప్రతికూలతలు ఇందు కు ఒక కారణం కాగా, బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ పేరుకుపోవడం మరో కారణం.
ఆర్థిక వ్యవస్థలో మార్పులు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలో ప్రవేశించేందుకు వేచి చూస్తున్న ఫ్రెషర్స్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి.
భారీగా కొత్త రిక్రూట్మెంట్ చేసుకొనే దిశగా ఐటీ సంస్థలు ఆలోచించడం లేదు. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది నియామకాలు ఆశాజనకంగా ఉండే అవకాశాల్లేవు.
మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆశాజనకం
ఈ ఏడాది ఐటీ, సర్వీస్ సెక్టార్లో ప్లేస్‌మెంట్స్ తగ్గే అవకాశం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, యుద్ధాలు, సర్వీస్ సెక్టార్లో ప్రాజెక్ట్‌లు తగ్గడం ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, మా కాలేజీలో సీఎస్ఈ విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్ దక్కాయి. కోర్ కోర్సుల్లో ప్లేస్‌మెంట్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. మెకానికల్‌లో 60కి 59 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ పొందారు. ప్రత్యేకించి తయారీరంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. మారుతి, ఎల్అండ్టీ, ఏసీ మాన్యుప్యాక్చరింగ్ సంస్థలు రిక్రూట్మెంట్స్ చేసుకొంటున్నాయి.
– శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్