స్టేషన్‌ఘన్‌పూర్, మార్చి 20 : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చిల్పూర్ మండలం వెంకటేశ్వర్రావుపల్లికి చెందిన గబ్బెట యాదగిరి తన ఇంటిని తన ఇద్దరు కొడుకులు ధర్మరాజు, శిరాజుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలని నిశ్చయించుకున్నాడు. యాదగిరి కొడుకు శివరాజు సబ్ రిజిస్ట్రార్‌ను కలువగా, రూ.22 వేలు ఖర్చవుతుందని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ప్రైవేట్ అటెండర్ ఏదునూరి రమేశ్‌కు రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, ఎక్సైజ్ శాఖ ఉద్యోగి రామినేని శ్రీనివాస్ కుటుంబానికి సహచర ఉద్యోగులు అండగా నిలిచారు. రూ.7.50 లక్షలను అందజేశారు. ఇటీవల మరణించిన శ్రీనివాస్ దశదిన కర్మను గురువారం నిర్వహించగా ఉన్నతాధికారులు, టీఎన్జీవో, ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఎక్సైజ్ గెజిటెడ్ అధ్యక్షుడు హరికిషన్ రూ.7.50 లక్షలను అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని, ఆయన మరణం తీరని లోటని హరికిషన్ పేర్కొన్నారు.