హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): యూ ట్యాక్స్ అంటూ నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్‌పై మహేశ్వర్‌రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా పదవులు పొంది, పార్టీ మారగానే ఆయనను విమర్శించడం పచ్చి అవకాశవాద రాజకీయమని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది స్వదేశీ నినాదం, విదేశీ వ్యాపారమని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని విమర్శించే అర్హత కిషన్‌రెడ్డికి లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని కిషన్‌రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.