సంగారెడ్డి జూలై 15(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు వేదికగా మారుతున్నది. ఐఐటీ విద్యార్థులను పరిశోధనలు, నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేలా ప్రతిఏటా ‘ఇన్నోవేషన్ డే’ను నిర్వహిస్తున్నది. సోమవారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘ఇన్నోవేషన్ డే-2024’ నిర్వహించారు. హెచ్‌సీఎల్ ఫౌండర్ అజయ్‌చౌదరి, ఐఐటీహెచ్ పాలకవర్గం చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి ‘ఇన్నోవేషన్ డే’ను ప్రారంభించారు.
ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 32 నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఆయా ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు, ప్రతినిధులు హాజరయ్యారు. టమాటలు పండించే రైతులు సాగు మొదలు పండిన టమాటాలు కోసేందుకు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలను గుర్తించిన ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి యువరాజ్, అగ్రి బీటెక్ విద్యార్థి శివ టమాటలు కోసేందుకు సెమి అటానమస్ అగ్రిబోట్‌ను తయారు చేశారు.
అగ్రిబోట్ వాహనం పైన సెన్సర్లు, రోబోటిక్ ఆర్మ్ ఉంటాయి. బ్యాటరీతో నడిచే అగ్రిబోట్‌ను టమాటా చేనులో పంపగానే పండిన టమాటలను గుర్తించి కోస్తుంది. అలాగే వాటిని గ్రేడింగ్ చేసి క్రేట్(బాక్సులు)లో వేస్తుంది. పదిరోజుల్లో కూలీలు కోసే టమాటాలను అగ్రిబోట్ నాలుగు రోజుల్లో కోస్తుంది. టమాట సాగు చేసే రైతులకు ఉపయోకరంగా ఉండాలన్న సంకల్పంతో అగ్రిబోట్ తయారు చేశామని ఫామ్ హెల్ప్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన యువరాజ్, శివ తెలిపారు.
మెట్లు ఎక్కేందుకు ‘హెవిటీ ఆటోమేషన్’
ఎత్తైన భవనాల్లోకి సామగ్రి, పరికరాలు, దివ్యాంగులను సులువుగా చేర్చేందుకు ‘హెవిటీ ఆటోమేషన్’ స్టార్టప్ కంపెనీ సెమి అటానమస్ యంత్రం తయారు చేసింది. ఆపార్టుమెంట్లు ఇతర భవనాల్లో లిఫ్టుల్లో చేరవేయలేని సామగ్రి, పరికరాలను సులువుగా మెట్ల మార్గం నుంచి తరలించేలా ఈ యంత్రాన్ని తయారు చేసింది. ఈ యంత్రంపై గృహ వినియోగ సామగ్రి, పరికరాలు, దివ్యాంగులు, వృద్ధులను ఉంచి మెట్లపైకి చేరిస్తే అది తనంతట తానుగా 50 అంతస్తులపైకి తీసుకువెళ్తుందని ఆవిష్కర్త నిక్కీ ఠక్కర్ తెలిపారు.
రిమోట్‌తో అల్ట్రాసౌండ్ స్కానింగ్..
అల్ట్రాసౌండ్ స్కానింగ్ యం త్రాలున్నప్పటికీ అత్యవసర సమయంలో రేడియాలజిస్టు లేకపోవటంతో గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐఐటీహెచ్‌కు చెందిన ‘ప్లెబ్సి ఇన్నోవేషన్స్’ స్టార్టప్ కంపెనీకి చెందిన ఐఐటీహెచ్ విద్యార్థి వివేక్ ‘రోబోటిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్’ యంత్రాన్ని తయారు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న రేడియాలజిస్టు మండలకేంద్రంలో ఉన్న రోబోటిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని రిమోట్ పద్ధతిలో వినయోగించి రోగులకు అవసరమైన స్కానింగ్ పరీక్షలు చేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఇది రోగులకు ఎంతో ఉపయోపడుతుందని ఆవిష్కర్త వివేక్ తెలిపారు.
వీధి వ్యాపారుల కోసం ఎలక్ట్రిక్ రిక్షా..
వీధి వ్యాపారులు కూరగాయలు ఇతర సరుకులను సులువుగా మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా ఐఐటీహెచ్ ఇంక్యుబేట్ చేసిన ‘ఆవిస ఆటోమోటివ్’ స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ రిక్షాను తయారు చేసింది. ఇది పూర్తిగా బ్యాటరీ ఆధారంగా నడుస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. స్ట్రీట్ వెండర్ ఎలక్ట్రిక్ రిక్షా వాడటం వల్ల వీధి వ్యాపారులు తక్కువ ఖర్చులో తమ సరుకులను మార్కెట్‌కు తీసుకెళ్లవచ్చని ఆవిష్కర్తలు పరేశ్ మిస్త్రీ, సాత్విక్‌రెడ్డి, గోకుల్ తెలిపారు.
నేవీకోసం సరికొత్త ఫైర్రెసిస్ట్ సూట్..
నేవీ కోసం ఐఐటీ విద్యార్థి సుకృత్ సరికొత్త ఫైర్ రెసిస్టెంట్ సూట్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఇండియన్ నేవీ వార్‌షిప్, సబ్‌మెరైన్‌లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వాటిని ఆర్పేందుకు నేవీ సిబ్బంది ఐదు కేజీలకుపైగా బరువున్న ఫైర్ రెసిస్టెన్స్ సూట్లను వాడుతారు.
ఈ కష్టాలు తొలగించేలా వీరా స్టార్టప్ కంపెనీకి చెందిన సుకృత్ బృందం తేలికైన ‘టార్డిగ్రేడ్’ అనే ఫైర్ రెసిస్ట్ సూట్ తయారు చేశారు. సాప్ట్ కాంపోజిట్ ఫైబర్‌తో తయారు చేసిన ఈ సూట్ 1200 డిగ్రీ ఫారన్‌హీట్ వరకు వేడిని రెసిస్ట్ చేస్తుంది. దీని బరువు 2.3 కేజీలు మాత్రమే. దీంతో ఇది నేవీ, ఫైర్ ఫైటర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు సులువుగా వాడవచ్చని ఆవిష్కర్త సుకృత్ తెలిపారు. కొన్ని పరీక్షలు ముగిసిన వెంటనే సరికొత్త సూట్లను భారత నేవీకి అప్పగిస్తామని చెప్పారు.