హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రైతుబీమా పథకం గందరగోళంగా మారింది. అసలు 2025-26 సంవత్సరానికి రైతుబీమా పథకం అమలవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త బీమా పాలసీ అమల్లోకి రావాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో మాత్రం ఏఈవోలు అదే రోజు అర్ధరాత్రి వరకూ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతోపాటు వాటిని అప్లోడ్ చేసే పనిలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో గడువులోగా రైతుబీమాకు అర్హులైన రైతుల వివరాలను అధికారులు ఎల్ఐసీకి అందించారా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అందించని పక్షంలో ఈ ఏడాది రైతుబీమా పథకం అమలుకాదని అధికారులు తెలిపారు. ఇదే జరిగితే రైతులకు కాంగ్రెస్ సర్కారు మరో పథకానికి శఠగోపం పెట్టడంతోపాటు తీవ్ర అన్యాయం చేసినట్టేన నే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ గందరగోళంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది రైతు ల వివరాలు మిస్ కావడంతోపాటు వివరాల నమోదులో తప్పులు దొర్లినట్టు తెలిసింది. ఏటా మూడు లక్షలకుపైగా కొత్త రైతులు రైతుబీమాలో నమోదవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంతమంది రైతులు నమోదయ్యారనే అంశంపై స్పష్టత లేదు.
వాస్తవానికి ఈ నెల 13వ తేదీతో రైతుబీమా గడువు ముగుస్తుందనే విషయం అధికారులకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలో గడువుకు 15 రోజుల ముందుగానే కొత్త రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతోపాటు పాత రైతుల వివరాల్లో తప్పులను సరిచేయాల్సి ఉంటుంది. కానీ, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతుబీమాకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలంటూ ఈ నెల 9న ఏఈవోలకు సర్క్యూలర్ జారీ చేశారు.
ఆ రోజు, ఆ మరుసటి రోజు(ఆదివారం) రెండు రోజులు కూడా సెలవులే. ఇక ఏఈవోలకు మిగిలింది మూడు రోజులే. దీంతో 15 రోజుల్లో చేయాల్సిన పనిని రెండు మూడు రోజుల్లో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏఈవోలంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఏఈవోలు కంటిమీద కునుకులేకుండా పనిచేశారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులపై ఏఈవోలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆలోచన లేకుండా, హడావుడి నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.