హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): పిల్లలను ఆడ, మగ అంటూ భేదాభిప్రాయంతో కాకుండా ఇద్దరికీ సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్క తల్లిదండ్రిపై ఉందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ అన్ని రంగాల్లో వారికి పురుషులతో సమానంగా హక్కులు కల్పిస్తున్నట్టు ఆమె చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో శనివారం ఫాగ్సి చైర్పర్సన్ శాంతాకుమారి అధ్యక్షతన జరిగిన అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నవీకరణలపై గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరైన పోషకాహారం అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నదని చెప్పారు. హరీశ్‌రావు వైద్య, ఆరోగ్య శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, అంతేకాకుండా కేసీఆర్ కిట్ల పంపిణీ, దవాఖానల్లో ప్రత్యేక వసతుల కల్పన వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా సెంటర్లు, సఖి సెంటర్లు వంటివి ఏర్పాటు చేసిందని, ముఖ్యంగా సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలకు అండగా నిలుస్తున్నదని మంత్రి చెప్పారు.
గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి, అలాగే ప్రసవం తరువాత ఇంటికి వెళ్లడం కోసం ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానల్లో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తున్నదని, అంతేకాకుండా అబ్బాయి పుడితే రూ.12,000, అమ్మాయి పుడితే రూ.13,000 అందిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.