TG Weather | రాబోయే రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబ్నగర్, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని టీజీడీపీఎస్ వివరించింది.