హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో చట్టవిరుద్ధంగా గిరిజనేతరులు గిరిజన భూముల (పోడు)ను పట్టా చేసుకున్నారని.. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు వ్యవసాయ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బీఆర్కే భవన్లోని రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు. గిరిజనుల ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. గిరిజన ప్రాంతాల్లో పోడు భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. వెంటనే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా రెవెన్యూ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మకజొన్న విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా కమిషన్ ముందుండి నడిపించిందని, పోడు భూముల విషయంలోనూ న్యాయం చేసేలా చూడాలని కమిషన్ను గిరిజన రైతులు వేడుకున్నారు. అదేవిదంగా వ్యవసాయ బావులకు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. పోడు భూములకు బ్యాంకు రుణాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ములుగు జిల్లా పర్యటనకు రైతు కమిషన్ వస్తదని కోదండరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చైర్మన్ కోదండరెడ్డితోపాటు సభ్యుడు భవానీరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి, కమిషన్ మెంబర్, సెక్రటరీ గోపాల్, ఏవో హరి వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.