హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): భూదాన్ భూముల వ్యవహారంలో పాతబస్తీలోని పలువురి ఇండ్లలో తనిఖీలు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం పలు విషయాలను వెల్లడించింది. ఖదీర్ఉన్నీసా, మునావర్‌ఖాన్, లతీఫ్ షర్ఫాన్, అక్తర్ షర్ఫాన్, సుకూర్ల నివాసాల్లో సోదాలు జరిపి 45 వింటేజ్కార్లు, రూ.23 లక్షల నగదు, 12,000 యూఏఈ దిర్హామ్‌లు, భూములకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కలిసి నకిలీ పత్రాలు తయారు చేసి ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించినట్టు ఈడీ గుర్తించింది.
మాహేశ్వరం మండలం, నాగారం గ్రామంలోని భూదాన్ భూమిని ఖదీరున్నీసా తాను వారసత్వంగా పొందినట్టు నకిలీ పత్రాలు సృష్టించి, అధికారుల అండదండలతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి, మధ్యవర్తుల సహకారంతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ మధ్యవర్తులు ప్రభుత్వ అధికారులతో చేతులు కలిపి నకిలీ పత్రాలతో ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, అమాయకులకు విక్రయించారని ఈడీ తెలిపింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉందని అధికారులు చెప్పారు.