Bhadrachalam | బూర్గంపహాడ్ (భద్రాచలం), ఆగస్టు 16: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆంధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆలయ ఈవో, అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వీరిపై ఆక్రమణదారులు కర్రలతో దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామాలయ భూములకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాలను మాత్రం ఆక్రమణదారులు ఆపడంలేదు.
1970 నుంచి 2022 వరకు ఏపీ హైకోర్టుతోపాటు స్థానిక, జిల్లా, ఎండోమెంట్ ట్రైబల్ సెటిల్మెంట్ కోర్టులు, తెలంగాణ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగానే ఉత్తర్వులు ఇచ్చాయని ఆలయ ఈవో తెలిపారు. అయినప్పటికీ ఈ ఆక్రమణలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. గతంలో 250 వరకు, తాజాగా 46 వరకు కేసులు ఆక్రమణదారులపై ఉన్నాయి. కానీ అవేవీ పరిష్కారం కాలేదు. అక్రమ కట్టడాల వల్ల దేవస్థానానికి వచ్చే కూరగాయలు, ఇతరత్రా ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నదని ఈవో పేర్కొన్నారు. సదరు భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రెండు నెలల క్రితమే ఏపీ రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సూచించారు. అయినప్పటికీ 50 శాతం నిర్మాణాలు పూర్తిచేశారు. తహసీల్దార్ ఆదేశాలను సైతం ఆక్రమణదారులు ఖాతరు చేయడం లేదు. దీంతో ఇటు భద్రాద్రి ఆలయ బాధ్యులు, అటు ఏపీ అధికారులు మండిపడుతున్నారు.