జహీరాబాద్, మార్చి 28: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతున్నది. వైన్, బార్ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటున్నది. ఎప్పుడంటే అప్పుడు.. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ ఇండ్లలోనే లభిస్తున్నది. కిలోమీటర్ల మేర దూరంలోని వైన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఐదో, పదో ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతున్నది. మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో వైన్ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వైన్ షాపు పరిధిలో కనీసం 30 చొప్పున బెల్టు షాపులు అనుబంధంగా పని చేస్తున్నాయి. తమ టార్గెట్లు చేరుకునేందుకు బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తూ, అక్రమంగా మద్యం అమ్మకాలు సాగించేలా వైన్‌షాపుల నిర్వా హకులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వైన్‌షాపుల నుంచి ఎమ్మార్పీ ధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలోనీ పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. నిర్వాహకులు సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నా పట్టించుకొనేవారు లేరు. ఆహార పదార్థాలు తయారు చేస్తూ మందుబాబులకు అందజేస్తున్నారు. బెల్టు షాపుల మధ్య పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్శించేందుకు ఇండ్లలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరిగా బెల్టు షాపుల్లో చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లేట్, తదితర ఆహార పదార్థాలను వండి అందిస్తున్నారు.
నిద్రావస్థలో అబ్కారీశాఖ..
విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నా అబ్కారీశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లిప్తతతో మద్యం కల్తీ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వైన్ షాపులు, బెల్టు షాపుల నుంచి మామూళ్లు అందుకుంటున్న అబ్కారీశాఖ అధికారులు మద్యంమత్తులో జోగుతున్నారనే బహిరంగ ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ నియోజకవర్గం లోని ఆయా మండలాల పరిధిలో కర్ణాటక చెందిన మద్యాన్ని తీసుకువచ్చి బెల్టు షాపుల్లో విక్రయిస్తున్నట్లు ఖరీదైన మందు బాటిళ్లలో కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బెల్ట్ షాపులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.