
సంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా స్ట్రక్చరల్ స్టీల్ వినియోగం పెరుగాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు మరిన్ని పరిశోధననలు అవసరమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. గురువారం ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ స్ట్రక్చరల్ స్టీల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. స్ట్రక్చరల్ స్టీల్ వాడకం పెరిగేందుకు పరిశ్రమలు ముందుకురావాలని, పరిశోధనలకు వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు భాగస్వాములు కావాలని కోరారు. స్ట్రక్చరల్ స్టీల్, డిజైన్ల వాడకంతో కలిగే లాభాలను ఆయన వివరించారు. ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ మహేంద్రకుమార్ మాధవన్ మాట్లాడుతూ.. దేశ నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థిరత్వం సాధించాలంటే స్ట్రక్చరల్ స్టీల్ వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాన్ఫరెన్స్లో టాటా స్టీల్ ఎండీ, సీఐఐ ప్రెసిడెంట్ నరేంద్రన్, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టీల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ డైరెక్టర్ జనరల్ పీకే మిశ్రా, లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ లెరోయ్ గార్డనర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ హెచ్కే పాలియూ, పలు వర్సిటీ ప్రొఫెసర్లతోపాటు టాటా స్టీల్స్, అపోలో స్టీల్స్, పెన్సార్, కిర్బి, ముత్యం స్టీల్స్ పరిశ్రమల ప్రతినిధులు, 120 మంది రిసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు.