Trust Token | బిలాయ్, జనవరి 15: భారత్‌తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ మోసం. రోజురోజుకు పెరుగుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఐఐటీ బిలాయ్ పురోగతి సాధించింది. ఆన్లైన్ లావాదేవీలు మరింత సురక్షితంగా ఉండేలా ఐఐటీకి చెందిన బృందం ఓ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. ఈ డివైజ్ సాయంతో యూపీఐ, ఈ-కామర్స్, నెట్ బ్యాంకింగ్ మరింత సురక్షితంగా ఉంటుందని ఐఐటీ బృందం వెల్లడించింది. పెన్‌డ్రైవ్ తరహాలో ఉండే ఈ డివైజ్‌ను ‘ట్రస్ట్ టోకెన్’గా పిలుస్తున్నారు.
బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ధీమన్ సాహా మాట్లాడుతూ.. ఆన్లైన్ లావాదేవీ జరపాలంటే ఈ డివైజ్‌ను కంప్యూటర్ లేదా ఫోన్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ఈ డివైజ్‌కు కూడా ఒక పాస్వర్డ్ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఒప్పందం పూర్తయితే త్వరలో ఈ డివైజ్ అందుబాటులోకి వస్తుందని, తద్వారా సైబర్ మోసాలు తగ్గే ఆస్కారం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.