
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సమర్థంగా వ్యవహరిస్తున్నదని డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ జాతీయ అటవీ అకాడమీ (ఐజీఎన్ఎఫ్ఏ) డైరెక్టర్ భరత్ జ్యోతి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న పర్యావరణ స్పృహతోపాటు అడవుల రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మెచ్చుకున్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ కారణాలతో తగ్గుతున్న అటవీ సంపదకు ప్రత్యామ్నాయంగా చేపడుతున్న పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో ఉత్పాదకతను ప్రోత్సహించాలని సూచించారు. ఫారెస్ట్ అకాడమీ, కొత్తగా నెలకొల్పిన ములుగు ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రశంసించారు.