KTR | హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ 15 నెలల పాలనలో తోఫా ఇవ్వకుండా ముస్లిం మైనార్టీలకు ధోకా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. షాదీముబారక్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని మాట తప్పిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ఇఫ్తార్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మాజీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రి వీశ్రీనివాస్గౌడ్తో కలిసి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం వారికి ఖర్జూర్ తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని చెప్పారు.
హిందువులతోపాటు ముస్లింలు, క్రిస్టియన్ల పండుగలకూ పేద కుటుంబాలకు బట్టలు పెట్టి గౌరవించారని గుర్తుచేశారు. గురుకులాలు నిర్మించి వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానమే కల్పించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నాడు మైనార్టీల ఓట్ల కోసం అడ్డగోలు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్, నేడు వారికి నిధులు కేటాయించకుండా నిండా ముంచుతున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ను సంప్రదించి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మసియుల్లాఖాన్, సలీం, ఖలీం, వజీరుద్దీన్, మాజిద్ఖాన్, అక్బర్, షేక్ అబ్దుల్, యూసుఫ్, ఇమాంఖాన్, వకార్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నరు: మహమూద్ అలీ
పదేండ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ ముస్లిం మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకున్నరని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. ‘ఏటా రంజాన్ పండుగకు తోఫా ఇచ్చి గౌరవించేవారు. మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేసి ముస్లిం పిల్లలకు మెరుగైన విద్యనందించారు. పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు షాదీముబారక్ కింద రూ.లక్ష అందించి ఆర్థిక చేయూతనందించారు’ అని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విస్మరించి మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.