Telangana | రాజోళి: పాఠశాలకు వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులు ప్రాణాలకు తెగించాల్సిందే! జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పచ్చర్లకు చెందిన విద్యార్థులు మాన్‌దొడ్డి పాఠశాలకు నిత్యం ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నారు. మాన్‌దొడ్డి గ్రామంలోని ఇంటర్ విద్యార్థులు అయిజలో విద్యనభ్యసిస్తున్నారు. నిత్యం ఆటోల్లో కిక్కిరిసి.. టాప్‌లపై కూర్చొని ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామాలకు బస్సులు నడపడం లేదని, దారిలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను వాపోతున్నారు.
బాన్సువాడ, ఆగస్టు 31: అనారోగ్యం బారినపడి గురుకుల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. జుక్కల్ మండలం పడంపల్లికి చెందిన అంజలి (12) ఏడో తరగతి చదువుతున్నది. ఇటీవల ఇంటికి వెళ్లిన బాలిక.. గత నెల 27న పాఠశాలకు వచ్చింది. గురువారం జ్వరంతోపాటు వాంతులు చేసుకున్నది. శుక్రవారం మరోసారి వాంతులు చేసుకోగా టీచర్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అంజలి మృతి చెందింది. ఘటనపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విచారణ చేపట్టారు.