హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాచిగూడకు చెందిన అరవింద్‌కు ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. సార్.. మీ ఫోన్‌పే యాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం, మీ ఫోన్‌కు ఒక నంబర్ వస్తుంది చెప్పండి అని అడిగారు. వెంటనే అరవింద్ తన ఫోన్‌కు వచ్చిన మేసేజ్(ఓటీపీ)ని చెప్పాడు. ఆ వెంటనే యూపీఐ యాక్టివేషన్ కోడ్ వచ్చింది. తిరిగి అదే నంబర్ నుంచి ఫోన్ చేసి మీకు వచ్చిన కోడ్‌ను బ్యాంకుకు పంపించాలని సూచించారు. దీంతో అరవింద్ ఆ నంబర్‌ను బ్యాంకుకు పంపించాడు. వెంటనే అరవింద్ ఫోన్లో ఉన్న ఫోన్‌పే యాప్ డిస్కనెక్ట్ అయ్యింది. కొద్దిసేపట్లో తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.2 లక్షలు మాయమయ్యాయి. ఇలా.. సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. ఫోన్‌పే, జీపే యూపీఐ లింక్‌లను తమ ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల వద్దకు ఎక్కువగా వస్తున్నాయి.
ఎలా చేస్తున్నారంటే..!
సైబర్ నేరగాళ్లు ముందుగా తమ ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేస్తారు. ఆ యాప్‌ను యాక్జివేట్ చేయాలంటే ఫోన్ నంబర్‌ను అడుగుతుంది. ఇక్కడే నేరగాళ్లు లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేస్తారు. మీ ఖాతా/యాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం.. మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది చెప్పండి అంటూ నమ్మిస్తారు. ఓటీపీ చెప్పగానే తన ఫోన్లో ఆ ఖాతాను యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు ఆ నంబర్‌కు ఏఏ బ్యాంకు ఖాతాలు లింక్ అయి ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఆ ఖాతాలకు బ్యాంకు నుంచి లింక్ కావాలంటే యూపీఐ యాక్టివేషన్ కోడ్ అడుగుతుంది. ఓటీపీతో యాక్టివేషన్ చేసిన నంబర్‌కు ఆ కోడ్ వస్తుంది. నేరగాడు ఆ కోడ్‌ను తిరిగి అసలైన ఖాతాదారుడికి పంపించి, అతని ఫోన్ ద్వారానే సదరు బ్యాంకు నంబర్‌కు ఆ మేసేజ్‌ను పంపించాలని సూచిస్తాడు. ఖాతాదారుడి ఫోన్ నుంచే ఆ కోడ్ రావడంతో సంబంధిత బ్యాంకు కూడా కొత్త ఫోన్ నంబర్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీంతో అతడు బ్యాంకు ఖాతాను నిర్వహించే వీలు కలుగుతుంది. ఇలా వారి ఖాతాలో ఉన్న మొత్తం నగదును కొట్టేస్తారు. ఈ తరహా మోసాలను నిలువరించేందుకు కొన్ని బ్యాంకులు ముందస్తు చర్యలు చేపట్టకపోవటంతో ఆయా బ్యాంకుల ఖాతాలు మోసగాళ్ల చేతిలోకి వెళ్తున్నాయి.
ఓటీపీ చెబితే అంతే..
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు యూపీఐ ఖాతాదారులను మోసంచేసి బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు. వివిధ కారణాలు చెబుతూ ఓటీపీలు తెలుసుకొని తమ ఫోన్లలో ఫోన్‌పే, జీపే యాప్‌లు డౌన్లోడ్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరు కూడా ఓటీపీని గుడ్డిగా చెప్పొద్దు. ఖాతాదారులు జ్రాగత్తగా ఉండాలి.