నల్లగొండ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో జరిగిన సర్పంచులు, వార్డ్ మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తిచేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయలేదని విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గర్జిస్తున్నారని, ఆయన గర్జనకు సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసుల పేరుతో నిరాధారమైన లీకులు ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలుచేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. నామినేటెడ్ పద్ధతిపై ఆయన ధ్వజమెత్తారు.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి భయంతో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడంలేదని, నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తూ కాలక్షేపం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలు పెడితే రైతులు తగిన బుద్ధి చెబుతారనే భయం ముఖ్యమంత్రిలో ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయదారులు, కూలీలు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని, ఆ ప్రభావం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
రైతు బంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల భరోసా వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్పై నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే.. రైతులకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే.. సహకార ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు.
ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఎన్ని రోజులు తప్పించుకున్నా, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని నిలదీయడం ఖాయమని కేటీఆర్ స్పష్టంచేశారు.