హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలుచేయాలని అంగన్వాడీ టీచర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది. తమకు గ్రాట్యుటీ విధానం అమలుతోపాటు ఆరోగ్య కార్డులు జారీచేయాలని డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆ సంఘం నాయకులు పలుసార్లు వినతిపత్రాలు అందచేశారు. సర్కారు స్కూళ్ల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లను అదే స్కూళ్లలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధనకు అవకాశం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు, డైరెక్టర్ కాంతి వెస్లీకి విల్లింగ్ లెటర్లు అందచేసినట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మల తెలిపారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1500 పైగా అంగన్వాడీలను అప్గ్రేడ్ చేశారు. వాటిని మోడల్ అంగన్వాడీలుగా మార్చి కొంతమంది అంగన్వాడీ టీచర్లకు పాఠాలు బోధించే అవకాశం కల్పించారు. మిగిలిన వారికి కూడా పీఎంశ్రీ పథకం కింద ఏర్పాటవుతున్న ప్రీ ప్రైమరీ క్లాసులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీల్లో 35,700 మంది టీచర్లు పని చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటనకు వెనుకాడబోమని ఆ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.