హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : అడివిసోమనపల్లి మానేరు ఒడ్డున ఉన్న నయనగుహలకు సమీపంలో సముద్ర మట్టానికి 836 మీటర్ల ఎత్తున ఉన్న ‘చిత్రిత శిలాశ్రయం’ ఎంతో ప్రత్యేకమైనది. దట్టమైన అడివిలో అది ఉన్నది. ఈ రాతిచిత్రాల తావును అడ్లకొండ రాజేశ్ అనే యూట్యూబర్ గుర్తించాడు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు చొల్లేటి శ్రీనివాస్ ఈ తావున ఉన్న రాతి చిత్రాలను పరిశీలించారు.
చిన్న కొండపై ఉన్న చిన్న రాతిచిత్రాల తావులో మెసోలిథిక్, నియోలిథిక్, మెగాలిథిక్, చారిత్రక కాలాలకు చెందిన రాతిచిత్రాలు(రాక్ ఆర్ట్) వంద ఉన్నాయి అని, సంఖ్యాపరంగా అవి తక్కువే అయినప్పటికీ తెలంగాణలో రాక్ ఆర్ట్ ధృక్కోణంలో అవి చాలా ముఖ్యమైనవి అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారులు, రాతిచిత్రాల నిపుణులు డాక్టర్ బండి మురళీధర్‌రెడ్డి, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శుక్రవారం అభిప్రాయపడ్డారు. ఈ గీతలు ఎరుపు, తెలుపు, నలుపుతోపాటు పుసుపు రంగులతో గీయబడి ఉన్నాయని తెలిపారు. గీతల్లో చేతి ముద్రలు, నిలబడి, కూర్చొని ఉన్న మానవ ఆకృతులు, జింక, ఎద్దు, ఏనుగు, తేనెపట్టు, పెట్టెలు, విల్లంబు పట్టుకున్న మానవ ఆకృతి పైన బాణం, మూల ఆకారం, ‘V’ ఆకృతి, త్రిశూలం తదితర ఆకృతులు వంటివి ఉన్నాయని పేర్కొన్నారు.