ICRISAT | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్‌లో తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతున్న బుందేల్‌ఖండ్ ప్రాంతం ఇక్రిశాట్ చొరవతో అనతికాలంలోనే ఆ సమస్య నుంచి గట్కెక్కింది. అక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన ఇక్రిశాట్.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న లలిత్పూర్, సింగార్, సుట్టా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఆయా గ్రామస్తుల భాగస్వామ్యంతో తొలుత సహజ వనరుల నిర్వహణ, గ్రౌండ్ వాటర్ రీచార్జింగ్లపై దృష్టి సారించింది.
హైడ్రాలజిస్టులతో కలిసి వాటర్ ఇంజినీరింగ్ ఇంటర్వెన్షన్ విధానాలను అమలు చేసింది. ఆయా గ్రామాల్లో 78 రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ పిట్స్‌ను ఏర్పాటు చేయించడంతోపాటు పంట పొలాల్లో బోర్‌వెల్స్‌ను రీచార్జ్ చేసేందుకు ప్రాధాన్యమిచ్చింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కేవలం మూడేండ్లలోనే 2 నుంచి 10 మీటర్ల మేరకు వృద్ధి చెందడంతోపాటు పంట దిగుబడులు 20 నుంచి 80 శాతం మేరకు పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు.