సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మానవరహిత వాహనాల సాంకేతికను అభివృద్ధి చేసేందుకు సంయుక్తంగా కలిసి పనిచేయాలని ఐఐటీ హైదరాబాద్‌లోని టీ-హాన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐకాట్) నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఐకాట్ డైరెక్టర్ పమేలా టిక్కు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఐఐటీ డైరక్టర్ మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్‌కు అనుబంధంగా ఉన్న టీ-హాన్ మానవరహిత వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు తయారు చేసిన వాహనాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇందుకోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా టెస్ట్ బెడ్‌ను నిర్మించినట్టు చెప్పారు. ఐకాట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఐకాట్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నదన్నారు. మానవరహిత వాహనాల అభివృద్ధి, ఆటోమోటివ్ టెస్టింగ్‌పై ఐకాట్ దృష్టిసారిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఇంక్యుబేటర్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. టీ-హాన్‌తో జరిగిన ఒప్పందం ఫలితంగా పరిశోధనల్లో మరింత వేగం పుంజుకుంటుందన్నారు.