Children | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణాల్లో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరి వాతావరణంలో తిరిగిన వారిలోనే పరిపక్వత ఎక్కువగా ఉందని తేలింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 18 ఏండ్లలోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై పరిశోధనలు చేసింది. గ్రామీణ ప్రాంతాల పెరిగిన పిల్లల కంటే ఎక్కువగా శారీరక ఎదుగుదలకు పట్టణ ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ 90 దశకం తర్వాత క్రమంగా పురోగతి మందగించిందని వెల్లడయ్యింది. 5-19 ఏండ్ల వయసు గల పిల్లల శారీరక ఎదుగుదల, మానసిక పరిపక్వతపై ఐసీఎంఆర్ సంస్థ ఎన్ఐఎన్తోపాటు దేశంలోని పలు సంస్థల భాగస్వామ్యంతో అధ్యయనం చేసింది.
పట్నవాసం పిల్లల్లో మందగిస్తున్న పురోగతి…
ఒకప్పుడు గ్రామాల కంటే పట్టణాల్లో పుట్టి పెరిగిన పిల్లల మానసిక, శారీక ఎదుగుదల సాధారణ పిల్లల కంటే మెరుగ్గా ఉండేది. గడిచిన రెండు దశాబ్దాలుగా మారుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య సౌలతులతో పల్లెటూరి పిల్లల్లోనే ఎదుగుదల ఎక్కువగా ఉందని వెల్లడయ్యింది. ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్‌లోనూ పట్టణ ప్రాంత పిల్లల్లో లోపం ఉన్నట్టు తేలింది. 1990-2020 వరకు అధ్యయనం చేసిన పరిశోధకులు క్రమంగా పట్టణాల్లో నివాసం ఉంటున్నవారిలో అభివృద్ధి లోపిస్తున్నదని పరిశోధకులు చెబుతున్నారు. హైస్కూల్ చదివే పిల్లలు కూడా వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదని పరిశోధనల్లో వెల్లడయ్యింది.