హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 16 నుంచి17 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు. వివరాల కోసం https://tgicet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని అడ్మిషన్స్ కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు.
బీఈడీలో మరో 7,441 సీట్లు భర్తీ
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీ ఎడ్సెట్ రెండో విడత కౌన్సెలింగ్లో మరో 7,441 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడతలో 12,076 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 7,441 మంది సీట్లు దక్కించుకున్నట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. 18లోపు కాలేజీల్లో రిపోర్ట్చేయాలని సూచించారు.
విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి : యూటీఎఫ్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): టెట్ నుంచి టీచర్లకు రక్షణ కల్పించాలంటే విద్యాహక్కు చట్టం సెక్షన్ 23ని సవరించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇన్ సర్వీస్ టీచర్లంతా రెండేండ్లల్లో టెట్ పాస్ కావాల్సి ఉందని, లేదంటే టీచర్ ఉద్యోగం కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని వాపోయారు.