హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు వరుసగా మూడోరోజు శనివారం కూడా ప్రశ్నించారు. సైబర్‌క్రైమ్ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అయితే పోలీసుల విచారణకు రవి ఏమాత్రం సహకరించడం లేదని, ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడని తెలిసింది. అయితే రవి నుంచి కొంత సమాచారాన్ని రాబట్టి అది కరెక్టేనా అని పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన మెయిన్సర్వర్లు ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో ఉన్నట్టు గుర్తించారు. బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే తన దగ్గర ఉన్నవి ఇచ్చానని, మిగతావి తనకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సైబర్‌క్రైమ్ పోలీసులు రవికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని మెయిల్ చేశారు. మరోవైపు రవి ప్రతి 20 రోజులకోసారి ఒక్కోదేశానికి వెళ్లినట్టు గుర్తించారు. రవి వెళ్లిన దేశాల్లో పైరసీ లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రవికి ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతున్నది.
నోరు విప్పడం లేదు..!
రవి నుంచి కీలకసమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ అతడు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఐబొమ్మ కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్య వివరాలపై అడిగినా పెద్దగా స్పందించడం లేదని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడిగితే తనకు గుర్తులేవని, మరిచిపోయానని అన్నాడని తెలిపారు. రవి ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచిపెడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. రవి సహకరించకపోవడంతో పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నట్టు తెలిసింది.