‘ఎద్దుల కొట్లాటలో దూడల కాళ్లిరిగినట్టు’ అనే సామెత ఎక్సైజ్‌శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రభుత్వ పెద్దల మధ్య మూటల కొట్లాటలో అధికారులు బలవుతున్నారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్, 2డీ బార్కోడ్ లేబుళ్ల ప్రింటింగ్ టెండర్ల వివాదంలో తవ్వుతున్న కొద్దీ పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తున్నాయి. పాత కంపెనీకే టెండరు కట్టబెట్టేందుకు ముఖ్యనేత.. కొడుకు స్నేహితుడికి ఇచ్చేందుకు మరో నేత మధ్య మొదలైన పంచాయితీలో ఇప్పటివరకు ఇద్దరు ఐఏఎస్‌లు బలయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్23 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో (Excise Department) హోలోగ్రామ్ టెండర్ల ( Hologram Tenders) వ్యాపారం విలువ ఏటా దాదాపు రూ.100 కోట్లు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇది చిన్న వ్యవహారం. దాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ నేతలు మూటల కోసం కొట్లాడుకొని రోడ్డున పడుతున్న తీరును విస్మయం కలిగిస్తున్నది. ఈ దందాలో నిజాయితీపరుడిగా గుర్తింపు ఉన్న ఐఏఎస్ అధికారికి అవినీతి మరక అంటగట్టడం చూసి అటు ప్రజలు, ఇటు బ్యూరోక్రాట్లు విస్తుపోతున్నారు. దక్కన్ సిమెంట్ సొమ్ముల్లో వాటాల కోసం గ్యాంగ్‌వార్ స్థాయిలో జరిగిన ఘటన పూర్తిగా తెగకముందే.. రూ.100 కోట్ల కాంట్రాక్టు కోసం ముఖ్యనేత, మంత్రి మధ్య కోల్డ్‌వార్ బహిర్గతమైంది. ఎక్సైజ్‌శాఖ నుంచి వచ్చే మూటలు, కాంట్రాక్టు పనుల్లో వాటాల పంచాయితీలు తేల్చలేక ఏకంగా ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు పూనుకోవడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ ‘మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం అటు ప్రజలను, ఇటు మేధావులను, బ్యూరోక్రాట్లను ఆలోచింపజేసింది. హోలోగ్రామ్, 2డీ బార్కోడ్ లేబుళ్ల ప్రింటింగ్ టెండర్ల వివాదం, రిజ్వీపై మంత్రి కార్యాలయ సోషల్ మీడియాలో లేఖలు లీకు చేయడంపై రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది.
ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వాటా కోసం కాంగ్రెస్ పెద్దల మధ్య కొట్లాట జరుగుతున్నదని నిరుడు ‘నమస్తే తెలంగాణ’ పసిగట్టింది. జరుగుతున్న వ్యవహారాన్ని ‘మద్యం లేబుళ్లపై రూ.100 కోట్ల అవినీతి’ అనే కథనం రూపంలో ప్రచురించింది. రిజ్వీపై ఆరోపణలు చేస్తూ మంత్రి తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు రాసిన 4 పేజీల ఫిర్యాదు లేఖలో కూడా ‘నమస్తే తెలంగాణ’ ప్రస్తావించిన అంశాల చుట్టే తిరగడం గమనార్హం. 2013 ఆగస్టు 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ఈ హోలోగ్రామ్ టెండర్ల ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఇది దేశంలో అత్యంత తక్కువ ధర, ఉత్తమ సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒప్పందం కావడం గమనార్హం. ఇది తెలంగాణలో 2014 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చి, 2019 జూన్ 30న ముగిసింది. కంపెనీ అభ్యర్థన, ఎక్సైజ్ అధికారుల సూచన మేరకు కేసీఆర్ ప్రభుత్వం అదే కంపెనీకి మరో మూడేండ్ల పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. 8 ఏండ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వచ్చింది. అతి తక్కువ ధరకే నాణ్యమైన హెడానిక్ పాత్ ఫైన్డర్ సాఫ్ట్‌వేర్‌తోపాటు ఒక బటన్ క్లిక్‌తో రోజుకు కోటి లేబుళ్లను ఉత్పత్తి చేయగల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. గరిష్ఠంగా రెండు పైసల నుంచి ఏడు పైసలలోపు ధరతో ఒక్కొక్క హైసెక్యూరిటీ హోలోగ్రామ్, 2డీ బార్కోడ్ లేబుల్ తయారవుతున్నాయి. దీంతో సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చే ఔత్సాహిక సంస్థలకు అవకాశం కల్పించడంతోపాటు, నకిలీ మద్యం, ఎన్డీపీఎల్ మద్యాన్ని సమర్థంగా అడ్డుకోవాలని అప్పటి సీఎం కేసీఆర్ ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. కాలయాపన లేకుండా టెండర్ నోటిఫికేషన్ జారీచేయాలని సూచించారు. టెండర్ల ప్రక్రియను మరింత కట్టుదిట్టంగా నిర్వహించే బాధ్యతలను ఎక్సైజ్ శాఖ నుంచి తొలిగించి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్)కు అప్పగించింది. 2022 నవంబర్ 21న టీఎస్టీఎస్ ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీచేసింది.15 కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. ఈలోగా ప్రభుత్వం మారింది.
ఎక్సైజ్ వ్యవహారాల్లో ఓ మంత్రి జోక్యం పెరగడం, ఎదురు తిరగడంపై ముఖ్యనేత విచారణ జరిపించారని సమాచారం. అప్పట్లో ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న శ్రీధర్ మంత్రికి వెన్నుదన్నుగా ఉన్నారని, లేఖల ద్వారా అధికారికంగా ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలనే సలహా ఆయనే ఇచ్చారని అనుమానించినట్టు గుసగుసలు. దీనికితోడు రాష్ట్ర మద్యం మార్కెట్లో డిమాండ్ ఉన్న లిక్కర్ బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్‌పై బిగ్‌బ్రదర్స్ కన్నేసినట్టు తెలిసింది. ఏడాదికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల రాబడి ఉన్న బ్రాండ్‌ను డిస్ట్రిబ్యూటర్ నుంచి బలవంతంగా గుంజుకోవడానికి విశ్వప్రయత్నం చేసినట్టు సమాచారం. కానీ సదరు డిస్ట్రిబ్యూటర్ వినకపోవడంతో ఆయనకు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న డిస్టిలరీని మూసేయాలని, తద్వారా లొంగదీసుకోవచ్చని బిగ్బద్రర్స్ భావించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్య నేతకు చేరవేయగా, ఆయన ఎక్సైజ్ కమిషనర్‌తో సదరు డిస్టిలరీపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం. విచారణ అనంతరం తప్పుడు నివేదిక ఇవ్వడానికి కమిషనర్ నిరాకరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన ముఖ్యనేత కమిషనర్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు నేతల మధ్య జరిగిన కొట్లాటలో మొదటి వికెట్‌గా ఐఏఎస్ శ్రీధర్‌ను పేర్కొంటున్నారు. ఈ ఘటనలతో ఆ మంత్రి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీపై అనుమానం పెంచుకున్నారని సమాచారం. ఆయన సలహాలు, సూచనలతోనే ముఖ్యనేత, ఆయన అనుచరులు తనకు అన్యాయం చేస్తున్నారని మంత్రి అనుమానించినట్టు ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. తనకు తెలియకుండా ఫైళ్లను రిజ్వీ తెప్పించుకొని, ముఖ్య నేతకు నేరుగా పంపుతున్నారని ఆయన భావించారట.
రాష్ట్రంలో హోలోగ్రామ్ వ్యాపారాన్ని దక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుమారుడి సన్నిహితుడు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతున్నది. దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఆయన కంపెనీ హోలోగ్రామ్ లేబుళ్లనే వాడుతున్నట్టు తెలిసింది. ఆయన కేంద్ర మంత్రితో ఫోన్ చేయించుకొని, నేరుగా ముఖ్యనేతను కలిసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లావాదేవీలు, చర్చలు అన్నీ అప్పుడే ముగిశాయని ముఖ్యనేత సన్నిహితవర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఓ మంత్రి కుమారుడి స్నేహితుడి కంపెనీ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఆ కంపెనీకే టెండర్లు ఇప్పించాలని మంత్రి పట్టుదలతో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సాధ్యమైనంత త్వరలో టెండర్లు ఖరారు చేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీపై మంత్రి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 2024 సెప్టెంబర్ 24న నిపుణుల కమిటీని ఏర్పాటుచేయగా, 27న అర్ధాంతరంగా రద్దుచేశారు. తిరిగి అదే నిపుణుల కమిటీని అక్టోబర్ 17న ప్రకటించారు. కేంద్రమంత్రి సిఫారసు చేసిన కంపెనీకి అనుగుణంగా కొన్ని సవరణలు, నిబంధనల్లో మార్పులు, చేర్పులతో కమిటీ వేశారని ఆరోపిస్తున్నారు. అనంతరం టెండర్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మొత్తం 23 కంపెనీలు హోలోగ్రామ్ లేబుళ్లు సరఫరా చేసేందుకు టెండర్లు వేశాయి. కానీ నిబంధనల మార్పుతో కంగుతిన్న సదరు శాఖ మంత్రి.. తనకు తెలియకుండా నిబంధనలు రూపొందించడంపై ఆగ్రహించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారులు పెత్తనాలు చేయొద్దని, ఎవరికి తోచిన నిబంధనలు వారు రుద్దవద్దని ఏకంగా మీడియా సమావేశంలో నర్మగర్భంగా ఆ మంత్రి హెచ్చరించారు. కొత్త నిబంధనల ప్రకారం తాను అనుకున్న కంపెనీకి టెండర్ వచ్చే అవకాశం లేకపోవడం, క్వార్టర్ సీసాల నుంచి వచ్చే కమీషన్ మొదలు.. హోలోగ్రామ్ టెండర్ల వరకు అన్నీ ముఖ్య నేత వర్గమే తీసుకుంటున్నదని, తనకేమీ దక్కడం లేదని ఆ మంత్రి ఉక్రోషంతో ఊగిపోయినట్టు సమాచారం. దీనికంతటికీ ముఖ్య కార్యదర్శే కారణమని, ఆయనపై రివేంజ్‌కు దిగినట్టు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఒత్తిళ్లు పెరిగాయని, దీనిని తట్టుకోలేక రిజ్వీ వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. బిగ్బద్రర్స్ను పాత ఒప్పందదారులు ఆశ్రయించడంతో ఒప్పందం కుదిరినట్టు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ముఖ్యనేత మౌఖిక ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా లేదా కొనసాగించకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. పాత కంపెనీకే మళ్లీ లేబుళ్ల ప్రింటింగ్‌ను అనుమతించి, సదరు కంపెనీకి ఎక్సైజ్ శాఖ బిల్లులు చెల్లిస్తున్నది. ఎప్పటికప్పుడు పాత ఒప్పందాన్నే పొడిగించుకుంటూ వస్తున్నది.
అక్కడి నుంచి వచ్చిన మూటలో వాటాలేమీ పంచకుండా నేరుగా బిగ్‌బ్రదర్స్ ఖజానాలో జమ అవుతున్నట్టు తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఏడాది గడిచినా హోలోగ్రామ్ తయారీదారుల నుంచి తన వాటా రాకపోవడంతో ఆ మంత్రి తీవ్ర
ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం. ఇదే సమయంలో మంత్రి కుమారుడి ద్వారా మరో కంపెనీ మార్కెట్లోకి వచ్చినట్టు తెలిసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం 2022 అక్టోబర్ 15న జారీచేసిన నోటిఫికేషన్‌తో టెండర్లు పిలవాలని ఎక్సైజ్ కార్యదర్శి రిజ్వీని మంత్రి మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరుడు ఆగస్టు 13న లేఖ ద్వారా లిఖితపూర్వక ఆదేశాలు జారీచేశారు. ఈ అంశాన్ని రిజ్వీ ముఖ్య నేత దృష్టికి తీసుకువెళ్లగా, పాత టెండర్ నోటిఫికేషన్ అమలుచేసే ప్రసక్తే లేదని, ఇప్పుడు ఉన్న కంపెనీ ఒప్పందాన్నే పొడిగించాలని ఆదేశించినట్టు తెలిసింది.