హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతూనే నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని పీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు.
వైఎస్ హయాంలో నాలుగేండ్లపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేసిన అనుభవం తనకు ఉండటం వల్లనే రేవంత్రెడ్డి తనను మళ్లీ అదే పోస్టులో నియమించారని వివరించారు. ఈ నెల 28న ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు వచ్చేలా కృషి చేయాలని రేవంత్ సూచించినట్టు తెలిపారు.