హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా టీఎస్ఆర్టీసీ దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మిషన్) అతి త్వరలోనే ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం 928 ఐ-టిమ్స్ యంత్రాలను కొనుగోలు చేసినట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని తొలివిడతలో దూరప్రాంతాల బస్సుల్లో ప్రవేశపెట్టనున్నట్టు వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం దూర ప్రాంత సర్వీస్‌లకు బస్సు బయలుదేరేందుకు గంట ముందే ఆన్లైన్ రిజర్వేషన్ నిలిపివేస్తున్నారు. ఐ-టిమ్స్‌తో ఇక ఆ ఇబ్బంది ఉండదని వారు తెలిపారు. బస్సు మొదటి స్టేజీ నుంచి ప్రారంభమైన తర్వాత కూడా ఆ మార్గంలోని తర్వాతి స్టాప్‌లలో బస్సు ఎక్కదల్చుకున్న ప్రయాణికులు ఆన్లైన్లో 15 నిమిషాల ముందు వరకు కూడా బస్సులో సీట్ల అందుబాటును బట్టి రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
ప్రయాణికులకు ఎంత సమయంలో బస్సు వారి స్టాప్ వద్దకు వస్తుందన్న సమాచారం సైతం ఐ-టిమ్స్ ద్వారా తెలుసుకోవచ్చునని, అన్నింటికి మించి ప్రయాణికులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఐ-టిమ్స్ (ఇది స్వైపింగ్ మిషన్లా కూడా పనిచేస్తుంది)లో చార్జీలు చెల్లించవచ్చని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు స్మార్ట్‌కార్డులను(మెట్రో రైలులో మాదిరిగా)అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. రివార్డు పాయింట్ల వ్యవస్థను అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.