హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల తాయిలాలను అడ్డుకునేందుకు జరుపుతున్న సోదాల్లో భాగంగా ఈ నెల 9 నుంచి 25 వరకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ రూ.53.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది. ఇందులో సరైన పత్రాలు లేని రూ.1.76 కోట్లతోపాటు తమ సొంత ఇంటెలిజెన్స్ ద్వారా పట్టుకున్న రూ.14.80 కోట్ల నగదుపై విచారణ జరుపుతున్నామని ఆ శాఖ డీజీ సంజయ్ బహదూర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. రశీదులున్న మిగిలిన రూ.38.17 కోట్ల నగదును సదరు యజమానులకు తిరిగి ఇచ్చినట్టు తెలిపారు. సోదాల్లో పట్టుబడిన 156 కిలోల బంగారు ఆభరణాలు, 454 కిలోల వెండికి సరైన రశీదులు చూపడంతో వాటికి కూడా క్లీన్చిట్ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐటీ శాఖ కూడా రాష్ట్రవ్యాప్తంగా విధు లు నిర్వర్తిస్తున్నదని, ఇందులో భాగంగా 33 జిల్లాల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఎయిర్పోర్ట్ ఇంటెలిజెన్స్ టీమ్‌ల ద్వారా సుమారు 250 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 150 మందిని మోహరించామని, వీరంతా నిరంతరం విధు లు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పట్టుబడితే ఐటీ శాఖ పరిధిలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎక్కడైనా అనుమాస్పదంగా లావాదేవీలు జరిగినా, డ బ్బులు అక్రమంగా చేతులు మారుతున్నా టోల్ ఫ్రీ నంబర్ 18004251785, ల్యాండ్‌లైన్ నంబర్ 040-23426201/23426202, వాట్సప్ నంబర్ 7013711399 లేదా cleantelanganaelections@incometax.gov.in ఈ-మెయిల్‌కు సమాచారం ఇవ్వాలని సంజయ్ బహదూర్ కోరారు.
340 కోట్ల సొత్తు స్వాధీనం
రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 25 వరకు సుమారు రూ.340.11 కోట్ల విలువైన సొత్తును తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.4.44 కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. బుధవారం వరకు రూ.119 కోట్ల పట్టుబడింది. రూ.18.67 కోట్ల విలువైన మద్యం, రూ.16.94 కోట్ల విలువైన గంజాయి, రూ.156 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.28.91 కోట్ల విలువైన ఇతర ఎన్నికల ప్రభావిత వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.