హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): విడుదలైన సినిమాలను వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ.. ఎట్టకేలకు చిక్కిన ఇమ్మడి రవి కేసుకు సంబంధించిన కీలక విషయాలను, నివ్వెరపచ్చే నిజాలను పోలీసులు వెల్లడించారు. రవికి నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ వీసీ సజ్జనార్ సినీ ప్రముఖులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, చెక్‌బుక్‌లు, కార్డులను ప్రదర్శించారు. మొత్తం 21 వేల సినిమాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
విదేశాలలో సర్వర్లను నిర్వహిస్తూ పైరసీ సినిమాలు చూసేవారి డాటాను సైబర్‌నేరగాళ్లకు అమ్ముతున్నట్టు తెలిపారు. అలాగే వారిని బెట్టింగ్ యాప్‌లలోకి మళ్లిస్తున్నట్టు వివరించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్‌క్రైమ్ పోలీసులు, సినీ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజ్, అక్కినేని వెంకట్ తదితరులతో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని విశాఖకు చెందిన ఇమ్మడి రవి హైదరాబాద్, ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో నాలుగేండ్ల క్రితం విడిపోయారు. కూకట్‌పల్లిలో ఒంటరిగానే నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా సాప్ట్వేర్ ఉద్యోగి అయిన రవి 2010లో ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి డోమైన్ రిజిస్ట్రేషన్, వెబ్‌హోస్టింగ్ డెవెలప్మెంట్కు సంబంధించిన వ్యాపారం కొన్నాళ్లు చేశాడని సీపీ తెలిపారు.

వెబ్ సర్వీసెస్‌లో అనుభవం ఉండడం, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ తక్కువ ధరలలో అందుబాటులోకి వస్తుండడం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు డిమాండ్ పెరుగుతుందని రవి గుర్తించాడు. ఆన్లైన్లో ఉచితంగా క్వాలిటీ సినిమాలు అందుబాటులోకి తేవడంతో, వాటి ద్వారా వచ్చే ప్రకటనలతో ఆదాయం సంపాదించాలని ముందుగా ప్లాన్ చేశాడు. దానికి తోడు గేమింగ్ యాప్‌లకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో ఆన్లైన్ గేమింగ్ ప్రకటనలతో ఆదాయం సంపాదించవచ్చని భావించాడు. 2019లో ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. దాని ద్వారా బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేశాడు.
ఇంతలో కొవిడ్ రావడంతో ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేసి, వెబ్సైట్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెచ్చాడు. రిలీజ్ అయిన సినిమాలు వెంటనే ఐబొమ్మలో వస్తున్నాయని మౌత్‌టాక్ రావడంతో ఒక్కసారిగా ఐబొమ్మకు డిమాండ్ పెరిగింది. అప్పటికే సినీ ఇండస్ట్రీ పైరసీ వెబ్సైట్ వల్ల నష్టం వస్తుందని గుర్తించి ఐబొమ్మలో ఉండే కంటెంట్‌ను బ్లాక్ చేయడం ప్రారంభించింది. దీంతో వందలాది డొమైన్లను పోర్ట్‌బ్లెయిర్ నుంచి రవి రిజిస్ట్రేషన్ చేయించాడు.
అందులో బాగంగా బప్పం టీవీ అనే కొత్తపేరును కూడా తీసుకొచ్చాడు. అందుకు తగ్గట్టుగా సొంతంగా విదేశాలలో సర్వర్లు కొనుగోలు చేశాడు. అమ్‌స్టర్‌డామ్, స్విట్జర్లాండ్‌లో వాటిని నిర్వహిస్తున్నాడు. ఒక డొమైన్ బ్లాక్ కాగానే మరో డొమైన్ ద్వారా నిరంతరాయంగా వెబ్సైట్లను తయారు చేసుకున్నాడు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌కు సంబంధించిన 1972లో వచ్చిన ‘ది గాడ్ ఫాదర్’ నుంచి 2025లో వచ్చిన ‘ఓజీ ‘వరకు 21 వేల సినిమాలు అతని వద్ద హార్డ్ డిస్క్‌లలో ఉన్నాయని సీపీ తెలిపారు.
వెబ్సైట్ యూజర్ల డాటాను రవి సైబర్‌నేరగాళ్లకు విక్రయిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. 1విన్, 1ఎక్స్‌బెట్ బెట్టింగ్ తదితర యాప్‌లలోకి యూజర్లను మళ్లిస్తుండడంతోపాటు ఆయా మూవీలను డౌన్లో చేసుకున్న సమయంలో ఏపీకే ఫైల్స్ కూడా డౌన్లోడ్ అయ్యే విధంగా మొబైల్, కంప్యూటర్లలో ఉండే విలువైన డాటాను కూడా అపహరిస్తున్నాడని తేలింది. తెలుగు ఫిల్మ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, యాంటీ వీడియో పైరసీ సెల్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దుద్దెల శివాజీని, సుసర్ల ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో రవిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడు ప్రస్తుతం రెండు విదేశాల పౌరసత్వాన్ని తీసుకున్నాడని, సుమారు రూ. 20 కోట్ల వరకు సంపాదించాడని వివరించారు.
ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ నేపథ్యంలో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో ఒక పోస్టు చేశారు. ‘మీకు ఇటీవల మా గురించి తెలిసి ఉండవచ్చు, మొదటి నుంచి నమ్మకమైన అభిమానమైనా ఉండవచ్చు.. ఏది ఏమైనా మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం. అందుకు క్షేమాపణ కోరుతున్నాం’ అంటూ ఐ బొమ్మ నిర్వాహకులు ఆ పోస్టులో తెలిపాడు. పోలీసులే రవితో ఈ పోస్ట్ పెట్టించి, వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసినట్టు సమాచారం.